Sidhu Moosewala Death : ప్రముఖ పంజాజీ సింగర్ సిద్ధూ మూసేవాలా దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య వెనుక ఎవరున్నారనే విషయాన్ని మాన్సా ఎస్‌ఎస్పీ గౌరవ్ తురా వెల్లడించారు. కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ ఈ హత్యకు బాధ్యత వహించినట్లు ఆయన తెలిపారు. మూసేవాలా థార్ వచ్చిన తర్వాత మూడు వాహనాల్లో దుండగులు వెంబడించారని, తర్వాత వాహనాన్ని చుట్టుముట్టి కాల్పులు జరిపారన్నారు. దుండగులు ఆల్టో, బుల్లెరో, స్కార్పియో వాహనాల్లో వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. లారెన్స్ బిష్ణోయ్, లక్కీ పాటియాల్ మధ్య జరిగిన గ్యాంగ్ వార్ కారణంగా మూసేవాలా హత్యకు గురయ్యాడని పోలీసులు తెలిపారు. లారెన్స్ బిష్ణోయ్ సహాయకుడు గోల్డీ బ్రార్ ఈ హత్యకు బాధ్యత వహించాడన్నారు. గోల్డీ బ్రార్ కెనడా నుంచే ముఠాను నిర్వహిస్తున్నాడన్నారు.
అకాలీ దళ్ లీడర్ హత్యలో సిద్ధూ హస్తం!
అకాలీ దళ్ లీడర్ విక్కీ మిద్దుఖేరా 2021లో హత్యకు గురయ్యాడు. ఈ హత్యలో ప్రమేయం ఉన్న ముగ్గురు దుండగులను ఇటీవల దిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ పట్టుకుంది. అరెస్టైన వారిలో షార్ప్ షూటర్ సజ్జన్ సింగ్ అలియాస్ భోలు, అనిల్ కుమార్ అలియాస్ లత్, అజయ్ కుమార్ అలియాస్ సన్నీ కౌశల్ ఉన్నారు. వీరిని తీహార్ జైలు నుంచి పంజాబ్ పోలీసులు రిమాండ్ చేశారు. ఆ హత్యలో ప్రముఖ గాయకుడి హస్తం ఉందని విచారణలో చెప్పారు. పోలీసుల సమాచారం ప్రకారం అతను పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా అని అనుమానిస్తున్నారు. విక్కీ మిద్దుఖేరా గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో సన్నిహితంగా ఉండేవాడని, అతని మరణానికి ప్రతీకారంగా లారెన్స్ బిష్ణోయ్ సిద్ధూ ముసేవాలాను అతని అనుచరులచే చంపి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కెనడాలో ఉన్న గోల్డీ అనే గ్యాంగ్‌స్టర్, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో కలిసి దిల్లీ, రాజస్థాన్, పంజాబ్, హరియాణాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని పోలీసులు నిర్థారించారు.