SI Beated Rider: శాంతి, భద్ర‌త‌ల‌ను కాపాడాల్సిన పోలీసులు సామాన్యులపై తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. వాహన తనిఖీలు చేస్తుండగా ఓ యువకుడు బైక్ ఆపలేదనే కోపంతో ఎస్‌ఐ రెచ్చిపోయాడు. తాను చెప్పినా కూడా బండి ఆపలేదన్న కోపంతో అతని చెంప చెళ్లుమనిపించాడు. దీంతో బాధితుడి చెవిలోని కర్ణభేరి డ్యామేజ్ అయింది. ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఉందో తెలుసా. 


చెంప చెళ్లమనిపించడంతో దెబ్బతిన్న కర్ణభేరి.. 
వాహనాలు నడిపే వాళ్లు నిబంధనలు పాటించకపోతే వారిపై కేసులు నమోదు చేయడమే పోలీసుల బాధ్యత. వాహనాల తనిఖీల సమయంలో ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కానీ కేవలం ఓ బైకర్‌ వాహనాల చెకింగ్ సమయంలో వాహనం ఆపలేదన్న కోపంతో నిజామాబాద్ జిల్లాకి చెందిన ఓ ఎస్‌ఐ తన ప్రతాపం చూపించాడు. ధర్పల్లి మండలం  ప్రాజెక్టు రామడుగు గ్రామానికి చెందిన పట్టేం శ్రీనివాస్ ప్రస్తుతం.. చెవి కర్ణభేరి దెబ్బతిని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.


వెంటనే ఆస్పత్రికి వెళ్లిన బాధితుడు.. 
బాధితుడు శ్రీనివాస్ గతనెల 25వ తేదీన పనుల నిమిత్తం పొలానికి వెళ్తుండగా ధర్పల్లి ఎస్ఐ వంశీకృష్ణ  త‌న సిబ్బందితో రామ‌డుగు గ్రామ శివారులో వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. అయితే  శ్రీనివాస్ పోలీస్ చెకింగ్ చూసుకోకుండా హ‌డావిడిగా పొలం దగ్గరకు వెళ్లి తిరిగి ఐదు నిమిషాల్లో వ‌చ్చాడు. దీంతో ఎస్ఐ కోపంతో శ్రీనివాస్ చెంప చెళ్లు మనిపించారు. ఎస్‌ఐ కొట్టిన దెబ్బకు శ్రీనివాస్ చెవిలో రీ సౌండ్‌ రావడంతో భయపడిపోయాడు. వెంటనే నిజామాబాద్ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి ఈఎన్ టీ వైద్యునికి చూపించుకోవడంతో చెవిలోని కర్ణభేరి దెబ్బతిన్నదని ఎలా జరిగిందని ప్రశ్నించడంతో అసలు విషయం చెప్పాడు శ్రీనివాస్.


తగ్గకపోతే ఆపరేషన్ చేయించుకోవాలంటున్న వైద్యులు.. 
ఎస్‌ఐ కొట్టాడని చెప్పడంతో కొన్ని రోజులు మందులు వాడితే తగ్గుతుందని చెప్పారు. ఒకవేళ తగ్గకపోతే ఆపరేషన్ చేయాల్సి వస్తుందని వివరించారు. డాక్టర్లు చెప్పిన విషయం విన్న శ్రీనివాస్ షాక్‌ అయ్యాడు. తనను అకారణంగా కొట్టారంటూ ఎస్‌ఐ వంశీకృష్ణపై హెచ్ఆర్‌సీని ఆశ్ర‌యించాడు. తాను పని మీద పొలానికి వెళ్తుంటే పోలీసులు ఆపారని వెంటనే వస్తానని చెప్పి వెళ్లి ఐదు నిమిషాల్లో తిరిగి వచ్చి హోంగార్డ్‌తో మాట్లాడుతున్న సమయంలో ఎస్ఐ వంశీకృష్ణ తనను కొట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. బైక్ పేపర్లు, లైసెన్స్ ఉన్నాయని చెప్పినా వినిపించుకోలేదని బాధితుడు వాపోయాడు.


హెచ్ఆర్సీని ఆశ్రయించిన బాధితుడు శ్రీనివాస్.. 
ఎస్‌ఐ కొట్టిన దెబ్బకు తనకు వినికిడి సమస్య వచ్చిందని.. ఈ లోపంతో తాను గల్ఫ్‌ దేశం వెళ్తే ఉపాధి కోల్పోతాననే ఆవేదనను హెచ్‌ఆర్‌సీకి నివేధించాడు. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని బాధితుడు శ్రీనివాస్‌ హెచ్‌ఆర్‌సీని కోరాడు. ఏదైనా పొరపాటు చేస్తే తనపై కేసు పెట్టాలి కానీ ఈవిధంగా కొట్టడం ఏంటని.. ఇప్పుడు జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నాడు. ఒకవేళ తన చెవు బాగవకపోతే... తన జీవనాధారం పోతుందని కన్నీటిపర్యంతమయ్యాడు. తన భవిష్యత్తు శూన్యం అవుతుందంటున్నాడు. ధర్పల్లి ఎస్ఐపై చర్య తీసుకొని తనకు తగిన న్యాయం చేయాలని హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశానన్నారు. బాధితుడికి జరిగిన అన్యాయంపై స్థానికులు కూడా గళం విప్పారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా అంటూ తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు. శ్రీనివాస్ చెవి బాగవకపోతే అతని పరిస్థితి ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు.