Man Killed While Diwali Celebrations In Delhi: దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) దీపావళి పండుగ రోజున తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బైక్‌పై వచ్చిన ఇద్దరు నిందితులు మంచిగా మాట్లాడినట్లే మాట్లాడి తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలోని షహదర ప్రాంతంలో ఈ హత్యలు జరిగాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి ఆకాశ్ శర్మ (44) అనే వ్యక్తి తన కుమారుడు, మేనల్లుడితో కలిసి ఇంటి బయట దీపావళి వేడుకలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అప్పుడే బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు వీరి ఇంటి ముందు ఆగారు. వీరిలో ఓ టీనేజర్ శర్మ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు. అనంతరం పక్కనే నిలబడిన మరో వ్యక్తి వెంటనే తుపాకీ తీసుకుని 5 రౌండ్ల కాల్పులు జరిపడంతో శర్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో అక్కడున్న వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
వెంబడించిన వ్యక్తిని కూడా..
కాల్పులు జరిగిన వెంటనే తేరుకున్న శర్మ మేనల్లుడు షూటర్లను వెంబడించాడు. ఈ క్రమంలో నిందితులు అతనిపైనా కాల్పులు జరపగా ప్రాణాలు కోల్పోయాడు. గాయాలపాలైన శర్మ కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు.
అయితే, బైక్‌పై వచ్చిన టీనేజర్.. డబ్బు అప్పుగా ఇచ్చాడని, అభిషేక్ శర్మ దాన్ని తిరిగి ఇవ్వలేదని పోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు. దీనికి సంబంధించి మృతుడిపై ఇదివరకే కేసు నమోదైనట్లు తెలిపారు. ఈ కేసులో సదరు టీనేజర్‌ను అదుపులోకి తీసుకున్నామని అన్నారు. హత్య కోసం అతను సుపారీ ఇచ్చాడని చెప్పారు.