చందానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో యువతి ఆత్మహత్య కేసులో అనేక విషయాలు బయటపడుతున్నాయి. ప్రియుడే హత్య చేసినట్టుగా తేలింది. ప్లాన్ ప్రకారం చేసి.. సాక్ష్యాలు దొరకకుండా చేయాలని ప్రియుడు భావించాడు. ఈ విషయాన్నే తనే ఒప్పుకున్నాడు. 


అసలేం జరిగిందంటే..
ప్రకాశం జిల్లా ఒంగోలు.. గ్రామానికి చెందిన నాగచైతన్య ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తుంది. గుంటూరు జిల్లాకు చెందిన కోటి రెడ్డి ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. కొన్ని రోజులు ఉద్యోగం లేకుండా తిరిగిన అతడు.. ఆ తర్వాత మెడికల్ రిప్రజెంటేటివ్ గా చేరాడు. పనిలో భాగంగా ఎప్పుడూ.. నాగ చైత్యన్య పని చేసే ఆసుపత్రికి వెళ్లేవాడు. ఈ క్రమంలో వారిద్దరికి పరిచయం పెరిగింది. కొన్ని రోజుల తర్వాత అది ప్రేమగా మారింది. ఈ క్రమంలో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లో చెబితే ఒప్పుకోరు అని అనుకున్నారు. 


నాగ చైతన్య తల్లి చిన్నప్పుడే చనిపోయింది.. ఆమె తండ్రి మరో వివాహం చేసుకున్నాడు. కొన్ని రోజుల కిందట తండ్రి కూడా మృతి చెందాడు. నాగచైతన్యకు సవతి తల్లి మాత్రమే ఉంది. కోటిరెడ్డి, నాగ చైతన్య ప్రేమ విషయం వారి ఇళ్లలో తెలిసింది. సామాజిక వర్గాలు వేరు కావడంతో పెళ్లికి నిరాకరించారు కుటుంబ సభ్యులు. ఈ పరిస్థితుల్లో ఒంగోలులో ఉద్యోగం వదిలి హైదరాబాద్ వచ్చింది నాగ చైతన్య. సిటీలోనే ఓ వైద్యశాలలో పని చేస్తోంది. 


ప్రియురాలిని కలవాలని ఈ నెల 22న హైదరాబాద్ వచ్చాడు కోటిరెడ్డి. ఇద్దరూ లాడ్జిలో ఓ గది అద్దెకు తీసుకున్నారు. ఓడ్కా తాగి రాత్రి అక్కడే బస చేసిన అతను స్విగ్గీలో ఇద్దరికీ భోజనం ఆర్డర్‌ పెట్టాడు. 23వ తేదీ రాత్రిపూట నాగచైతన్య హత్యకు గురైంది.  24 తేదీ ఉదయం 11 గంటలకు హోటల్‌ గదికి తాళం వేసి బయటకు వెళ్లాడు. హోటల్‌ సిబ్బందికి అనుమానం వచ్చి తలుపులు తెరిచి చూశారు. నాగచైతన్య రక్తపు మడుగులో పడి మృతి చెందింది.


కానీ కోటిరెడ్డి మాత్రం కనిపించలేదు.  దీనిపై చందానగర్ పోలీసులు హత్యకేసుగా నమోదు చేశారు. హైదరాబాద్ లాడ్జీలో అదృశ్యమైన కోటిరెడ్డి ఒంగోలు జీజీహెచ్ లో దర్శనమిచ్చాడు. ఒంటిపై కత్తిపోట్లు ఉన్నాయి. పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని.. ఇద్దరూ కలిసి.. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పాడు.  కత్తి పోట్ల తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లినట్టు ఆ తర్వాత ఏమైందో తెలియని అన్నాడు. బంధువులు ఎవరో తనను కాపాడి.. ఒంగోలు వైద్యశాలలో చేర్పించినట్టు వెల్లడించాడు. ఒంగోలు జీజీహెచ్ లో అతడిని అదుపులోకి తీసుకుని... అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకు వచ్చారు పోలీసులు. కోటిరెడ్డే చంపేసి... నాటకం ఆడుతున్నాడా? అనే అనుమానం వ్యక్తం చేశారు. ఆ అనుమానమే నిజమైంది. 


అంతకుముందే కోటిరెడ్డి ఓ సూపర్‌ మార్కెట్‌లో కత్తి, తాడు కొనుగోలు చేశాడు. లాడ్జి రూమ్‌కు తీసుకెళ్లిన కోటిరెడ్డి ముందుగానే వొడ్కా బాటిల్, కత్తి, తాడు తన బ్యాగ్‌లో తీసుకెళ్లాడు. రాత్రి ఇరువురు ఓడ్కా సేవించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అనంతరం వివాహం విషయంలో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకొని ఉంటుందని ఆ క్రమంలోనే ప్రియురాలిని కత్తితో గొంతుకోసి హత్య చేసి ఉంటాడని ప్రాథమిక సాక్ష్యాధారాలను బట్టి తెలుస్తోంది. అయితే అంతకు ముందు కూడా పెళ్లి విషయంలో ఇద్దరికీ గొడవలు జరిగినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


Also Read: Crime News: ఆమెతో కలిసి ఆ రోజు లాడ్జికి వెళ్లాడు.. చంపేశాడా? చచ్చిపోవాలనుకున్నారా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి