Shamshabad Airport :  హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. డీఆర్‌ఐ అధికారుల తనిఖీల్లో పెద్ద మొత్తంలో హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన మహిళా ప్రయాణికురాలి వద్ద 3.12 కిలోల హెరాయిన్‌ను డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన మహిళ ఖతార్‌ నుంచి దోహా మీదుగా హైదరాబాద్‌ కు వచ్చింది. కస్టమ్స్ అధికారులకు అనుమానం రాకుండా హెరాయిన్‌ను రెండు కవర్స్‌లో చుట్టి ట్రాలీబ్యాగ్ కింది భాగంలో సీక్రెట్ గా అమర్చారు. ముందస్తు సమాచారంతో శంషాబాద్ విమానాశ్రయంలో డీఆర్‌ఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మహిళ ట్రాలీబ్యాగ్ తనిఖీ చేసిన డీఆర్‌ఐ అధికారులు భారీ మొత్తంలో హెరాయిన్‌ను పట్టుకున్నారు. ఈ హెరాయిన్‌ విలువ సుమారు రూ.21.90 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం ప్రయాణికురాలిపై కేసు నమోదు చేశారు. నిందితురాలిని జుడిషియల్‌ రిమాండ్‌కు తరలించినట్లు డీఆర్ఐ అధికారులు తెలిపారు. 


పాక్ నుంచి మాదక ద్రవ్యాలు   


పాకిస్థాన్ నుంచి మన దేశంలోకి పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలు సరఫరా అవుతున్నాయి. గుజరాత్ సముద్ర తీరంలో తాజాగా భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. పాక్ నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ. 280 కోట్ల విలువైన హెరాయిన్ ను ఇండియన్ కోస్ట్ గార్డ్స్, గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ స్వాధీనం చేసుకున్నాయి. రూ.280 కోట్ల విలువైన హెరాయిన్‌తో కూడిన పాకిస్థానీ ఓడ 'అల్ హజ్‌'ను ఇండియన్ కోస్ట్ గార్డ్ పట్టుకుంది. గుజరాత్ రాష్ట్ర తీరానికి సమీపంలోని అరేబియా సముద్రంలో తొమ్మిది మంది సిబ్బందితో కూడిన పాకిస్థాన్ ఓడను పట్టుకుని, అందులో ఉన్న రూ.280 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుంది.


అట్టారీ బోర్డర్ వద్ద 


పాకిస్థాన్ ఓడ 'అల్ హజ్' భారత జలాల్లోకి ప్రవేశించినప్పుడు భారత తీర రక్షక దళ నౌకలు అడ్డగించి పట్టుకున్నాయని రక్షణశాఖ ప్రతినిధి తెలిపారు. హెరాయిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారని, తదుపరి విచారణ కోసం పడవతో పాటు అందులో ఉన్న పాకిస్థాన్ సిబ్బందిని గుజరాత్‌లోని కచ్ జిల్లాలోని జాఖౌ నౌకాశ్రయానికి తీసుకు వచ్చినట్లు రక్షణ శాఖ ప్రతినిధి చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లోనూ భారత భూభాగంలోకి డ్రగ్స్‌ను రానివ్వబోమని ఇండియన్ కోస్ట్ గార్డ్స్ తెలిపింది. పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్‌ను భారత్ చేర్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని పేర్కొంది.


అట్టారీ సరిహద్దులో ఆదివారం కస్టమ్స్‌ డిపార్ట్‌మెంట్‌ రూ.700 కోట్ల విలువైన 102 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుంది. అఫ్గానిస్థాన్‌ నుంచి ఈ డ్రగ్స్‌ను తరలించగా అమృత్‌సర్‌ కస్టమ్స్‌ (పీ) కమిషనరేట్‌ పరిధిలోని ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్ట్‌ (ఐసీపీ)లో 102కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది.