ఎండ వేడితోపాటు గాల్పుల తీవ్రత కూడా రోజు రోజుకు పెరుగుతుంది. ముఖ్యంగా వేడి గాలులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వడ దెబ్బ(Heat Stroke)కు గురైతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఎవరైనా వడదెబ్బకు గురైతే వెంటనే హాస్పిటల్‌కు తరలించాలి. అప్పటివరకు బాధితుడు ప్రాణాలతో ఉండాలంటే మీరు తప్పకుండా ప్రథమ చికిత్స అందించాలి. 
 
హీట్ స్ట్రోక్ లేదా సన్ స్ట్రోక్ (వడ దెబ్బ) అంటే?: సూర్యుడి వేడి వల్ల వీచే వేడిగాలులే వడగాల్పులు. ఇవి మన కళ్లు, చెవుల ద్వారా శరీరంలోకి చేరుతాయి. శరీర ఉష్ణోగ్రతను ఈ గాలులు పెంచేస్తాయి. ఫలితంగా మెదడు, అంతర్గత అవయవాలు దెబ్బతింటాయి. దీంతో శరీరం అదుపుతప్పి కొన్ని లక్షణాలు బయటపడతాయి. తలనొప్పి, వాంతులు, మూర్ఛ, అలసట, తల తిరగడంతో పాటు స్పృహ కూడా కోల్పోవచ్చు. వడ దెబ్బ పిల్లలకు, పెద్దలకు హానికరం. ఆరోగ్యంగా ఉన్న క్రీడాకారులు సైతం వడ దెబ్బ ప్రభావం చూపుతుంది. కాబట్టి, వయస్సుతో పనిలేకుండా ప్రతి ఒక్కరు వడ గాల్పుల నుంచి జాగ్రత్తగా ఉండాలి. 


సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ సేపు ఎండలో, వేడి గాలుల్లో తిరగకూడదు. ఎండ తీవ్రత వల్ల శరీరం డీహైడ్రేషన్‌‌కు గురై ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థ విఫలమవుతుంది. వడ దెబ్బకు గురైన వారి శరీర ఉష్ణోగ్రత 104 F కంటే ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇది శరీరంలోని ప్రధాన నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే, వడ దెబ్బ తగిలిన వెంటనే వికారం, మూర్ఛ, గందరగోళం, అయోమయంగా ఉంటుంది. స్పృహ కోల్పోయి, కోమాలోకి వెళ్లిపోతారు. 


వడ దెబ్బ లక్షణాలివే: 
☀ శరీర ఉష్ణోగ్రత 104 F కంటే ఎక్కువగా ఉంటుంది.
☀ మూర్ఛపోయే ప్రమాదం ఉంది.
☀ తీవ్రమైన తలనొప్పి లేదా తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది.
☀ చెమట పట్టడం ఆగిపోతుంది. 
☀ శరీరం పొడిగా లేదా ఎర్రగా మారిపోతుంది.
☀ కండరాలు బలహీనమవుతాయి. తిమ్మిరి ఏర్పడుతుంది.
☀ వికారం, వాంతులు.
☀ గుండె వేగంగా కొట్టుకుంటుంది.
☀ శ్వాస పీల్చుకోడానికి ఇబ్బంది ఏర్పడుతుంది.
☀ గందరగోళం, అయోమయంగా ఉంటుంది. వింతగా ప్రవర్తిస్తారు.
☀ మూర్ఛలు ఏర్పడతాయి. అపస్మారక స్థితికి చేరుకుంటారు. 


వడ దెబ్బ తగిలిన వెంటనే ఇలా చేస్తే ప్రాణాలు దక్కుతాయి: రోడ్డు పక్కన ఎవరైనా వడ దెబ్బతో పడిపోయినా, లేదా మీకే వడ దెబ్బ తగిలినట్లుగా సందేహం కలిగిన తప్పకుండా ప్రథమ చికిత్స అవసరం. వీలైతే ఇతరుల సాయం తీసుకునైనా ఇక్కడ చెప్పినట్లు చేయండి. 
☀ ఎవరైనా వడదెబ్బకు గురై పడిపోయినట్లయితే అంబులెన్స్‌కు కాల్ చేయాలి. 
☀ అంబులెన్స్ వచ్చేలోపు మీరు బాధితుడిని చల్లగా ఉండే ప్రదేశం లేదా చెట్టు నీడలోకి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయాలి.
☀ అవసరమైతే బాధితుడిపై అదనగా ఏమైనా దుస్తులు ఉంటే వాటిని తొలగించి గాలి తగిలేలా చూడండి. 
☀ ఆ వ్యక్తి శరీర ఉష్ణోగ్రత తగ్గించడం కోసం క్లాత్‌ను చల్లని నీటితో తడిపి శరీరాన్ని తుడవండి.
☀ వడదెబ్బ వల్ల బాధితుడి శరీర ఉష్ణోగ్రత 104 Fకు చేరుకొనే అవకాశం ఉంటుంది. దాన్ని 101 F నుంచి 102 F వరకు తగ్గించాలి.
☀ థర్మామీటర్లు అందుబాటులో లేకపోయినా ప్రథమ చికిత్స చేయడానికి వెనకాడకండి.
☀ వీలైతే బాధితుడిని సమీపంలోని ఏదైనా ఆఫీస్, షాప్, ఇంట్లోకి తీసుకెళ్లి చల్లని వాతావరణంలో ఉంచండి. 
☀ ఐస్ ప్యాక్‌లు అందుబాటులో ఉంటే బాధితుడి చంకలు, గజ్జలు, మెడ, వీపు భాగాల్లో పెట్టండి. 
☀ పైన చెప్పిన శరీర భాగాల్లో రక్తనాళాలు చర్మానికి దగ్గరగా ఉంటాయి. అవి చల్లబడితే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది.
☀ బాధితుడి షవర్ కిందకు తీసుకెళ్లి స్నానం చేయించినా పర్వాలేదు. లేదా చల్లని నీటి టబ్‌లోనైనా ముంచవచ్చు.
☀ ఆరోగ్యం, యవ్వనంగా ఉండే వ్యక్తి తీవ్ర వ్యాయామం వల్ల వడ దెబ్బకు గురైతే.. ‘ఎక్సర్షనల్ హీట్ స్ట్రోక్’ అని అంటారు. వీరికి ఐస్ బాత్‌ చేయించాలి. 
☀ వృద్ధులు, చిన్న పిల్లలు, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న రోగులు లేదా వ్యాయామం చేయని వ్యక్తులు, మద్యం తాగేవాళ్లు వడదెబ్బకు గురైనట్లయితే ఐస్ లేదా మంచును అస్సలు ఉపయోగించవద్దు. అలా చేస్తే చేయడం చాలా ప్రమాదకరం. వీలైనంత వరకు సాధారణ నీటితోనే వారి శరీర ఉష్ణోగ్రత తగ్గించే ప్రయత్నం చేయాలి.


Also Read: ఈ పానీయాలతో పెయిన్‌కిల్లర్ మాత్రలు అస్సలు తీసుకోవద్దు, అలా చేస్తే..


వడ దెబ్బకు గురికాకుడదంటే ఈ జాగ్రత్తలు పాటించాలి: 
☀ వేసవిలో బయటకు వెళ్లేప్పుడు తప్పకుండా మీ వెంట నీటి బాటిల్ ఉండాలి. వీలైతే ORS లేదా ఎలక్ట్రోలైట్‌, గ్లూకోజ్ వాటర్ మీ వెంట తీసుకెళ్లండి.
☀ శరీరానికి గాలి తగిలే కాటన్, వదులైన దుస్తులు ధరించాలి.
☀ మీరు వేసుకొనే దుస్తులు మీ చెమటను పీల్చగలగాలి. అలా ఉండటం వల్ల మీ దుస్తులు తడిగా ఉండి శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తాయి.
☀ ఆల్కహాల్ తాగిన తర్వాత ఎండలోకి వెళ్లకూడదు. 
☀ కేవలం ఎండలోకి వెళ్తేనే కాదు, ఇంట్లో ఉన్నా సరే వడ దెబ్బ తగులుతుంది. కాబట్టి, వీలైనంత వరకు మీ ఇంటిని చల్లగా ఉంచుకొనే ప్రయత్నం చేయండి.
☀ సీలింగ్ ఫ్యాన్స్ కంటే టేబుల్ ఫ్యాన్ బెటర్. దానికి కాస్త దూరంలో గానీ, కిటికీ గానీ చల్లని క్లాత్ వేలాడిదీసి టేబుల్ ఫ్యాన్ ఆన్ చేస్తే గది చల్లబడుతుంది. 
☀ ఏసీలో ఎక్కువ సేపు ఉండేవారు.. ఒకేసారి ఎండలోకి లేదా వేడి వాతావరణంలోకి వెళ్లినా వడదెబ్బకు గురవ్వుతారు. 
☀ వీలైనంత ఎక్కువ నీటిని తాగడం ద్వారా శరీరానికి చెమట పట్టేలా చూసుకోవాలి. 
☀ 30 లేదా అంతకంటే ఎక్కువ సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ (SPF) ఉన్న సన్‌స్క్రీన్‌ని ఉపయోగించండి.
☀ రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు, పండ్ల రసం లేదా కూరగాయల రసం త్రాగడానికి సిఫార్సు చేయబడింది. 


Also Read: ఈ స్నాక్స్‌తో గుండె జబ్బులు పరార్, వీటిని రోజూ తింటే మరింత ఆయుష్షు


ఎవరికి ఎక్కువ ప్రమాదం?: 
☀ శిశువులు, నాలుగేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, 65 ఏళ్లు దాటిన పెద్దలకు ‘వడ గాల్పులు’ అత్యంత ప్రమాదకరం. 
☀ మిగతావారి కంటే వీరి శరీరం త్వరగా వేడెక్కి, నెమ్మదిగా చల్లబడుతుంది. అందుకే, వారిని కంటికి రెప్పలా చూసుకోవాలి. 
☀ గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాల వ్యాధి, ఊబకాయం, తక్కువ బరువు, అధిక రక్తపోటు, మధుమేహం, మానసిక అనారోగ్యం, మద్యపానం ఉన్నవారికి కూడా ఈ వేసవి ప్రమాదకరమే. 
☀ చెవుల్లోకి వేడి గాలి వెళ్లకుండా రుమాలు కట్టుకోవాలి. బైకు, స్కూటర్లపై వెళ్లేవారు సైతం చెవులు కవరయ్యేలా హెల్మెట్లు ధరించాలి. 
☀ వేడి గాలి వల్ల కళ్లు పొడిబారకుండా ఉండాలంటే సన్ గ్లాసెస్ తప్పకుండా పెట్టుకోవాలి. 
☀ తలకు నేరుగా ఎండ తగలకుండా ఉండేందుకు టోపీ ధరించాలి. 
☀ తెల్లని వస్త్రాలను మాత్రమే వేసుకోండి. బిగువైన దుస్తులు ధరించడం అంత మంచిది కాదు. 
☀ వ్యాయామానికి రెండు గంటల ముందు 24 ఔన్సుల ద్రవాన్ని త్రాగాలని, వ్యాయామానికి ముందు మరో 8 ఔన్సుల నీరు లేదా స్పోర్ట్స్ డ్రింక్‌ని తాగాలని వైద్యుల సిఫార్సు. వ్యాయామం చేసే సమయంలో, మీకు దాహం అనిపించకపోయినా, ప్రతి 20 నిమిషాలకు మరో 8 ఔన్సుల నీటిని తీసుకోవాలి.
☀ సూర్యోదయం సమయంలోనే పనులు చక్కబెట్టుకోండి. మిట్టమధ్యాహ్నం కాకుండా సూర్యస్తమయం సమయంలో ఇంటికి వెళ్లేలా ప్లాన్ చేసుకోండి. 
☀ కెఫీన్ లేదా ఆల్కహాల్ ఉన్న ద్రవాలను అతిగా తీసుకోవద్దు. పూర్తిగా మానేసినా మంచిదే. ఎందుకంటే అవి మీ శరీరంలోని ద్రవాలను కోల్పోయేలా చేస్తాయి. శరీరాన్ని వేడెక్కిస్తాయి. 
☀ వేసవిలో కాసింత ఉప్పు పానీయం తీసుకోవడం మంచిదేనని వైద్యులు సూచిస్తున్నారు. అయితే, రక్తపోటు సమస్యలు ఉన్నవారు వైద్యుడి సలహా తీసుకోవాలి.  
☀ రాత్రి వేళలల్లో ఇంటి కిటికీలు తెరిచి ఉంచి చల్లని వాతావరణం నెలకొల్పండి. 
☀ వడ దెబ్బకు గురై కోలుకున్న తర్వాత అలసటగా ఉంటారు. కాబట్టి, కొద్ది రోజులు పెద్ద పెద్ద పనులు, వ్యాయామానికి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.