విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల కళ్లు కప్పి బయటికి వచ్చిన స్మగ్లర్... సీఐఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ అధికారుల తనిఖీలో పట్టుబడ్డాడు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు బేరింగ్ రూపంలో బంగారం అమర్చుకొని స్మగ్లింగ్ చేస్తుండగా సీఐఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న 600 గ్రాముల బంగారాన్ని పట్టుకున్న అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం, నిందితుడ్ని  కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. 


కస్టమ్స్ కళ్లు గప్పి బయటకు 


 శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమ బంగారాన్ని సీఐఎస్ఎఫ్ అధికారులు పట్టుకున్నారు. 600 గ్రాముల‌ బంగారాన్ని సీఐఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారుల కళ్లు గప్పి బంగారంతో బయటకు వచ్చిన స్మగ్లర్స్... బంగారాన్ని రిసీవర్స్ ఇస్తుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులను కస్టమ్స్ అధికారులకు అప్పగించారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసిన కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.  


15 కిలోల గోల్డ్ సీజ్ 


శంషాబాద్‌ ఎయిర్ పోర్టులో ఇటీవల భారీగా బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు సీజ్ చేశారు. బూట్లు, లగేజీ, బట్టల మధ్యలో బంగారాన్ని దాచి అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు. సూడాన్‌ దేశం నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకొన్న 23 మంది మహిళ ప్రయాణికుల నుంచి సుమారు 15 కిలోల గోల్డ్ ను గుర్తించి, వారిని అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.7 కోట్ల 89 లక్షలు ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.  






బంగారాన్ని పేస్టుగా మార్చి లోదుస్తుల్లో స్మగ్లింగ్ 


శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇటీవల అక్రమ బంగారం పట్టుబడింది. దుబాయ్‌ నుంచి వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేయగా... ఓ వ్యక్తి వద్ద 823 గ్రాముల బంగారం పట్టుబడింది. ఆ గోల్డ్ విలువ రూ.47 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.  బంగారాన్ని పేస్టుగా మార్చి, ప్లాస్టిక్‌ కవర్‌లో ప్యాక్‌ చేసి, దానిని లోదుస్తుల్లో దాచి స్మగ్లింగ్ చేశాడని చెప్పారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకుని అధికారులు విచారిస్తున్నారు.  


పుష్ప సినిమా తరహాలో గంజాయి స్మగ్లింగ్ 


 పోలీసులకు చిక్కకుండా పుష్ప సినిమాలో పుష్పరాజ్ వేసే ప్లాన్ తరహాలోనే హైదారబాద్ లో పలువురు అక్రమార్కులు గంజాయి తరలింపుకు ఓ ప్లాన్ వేశారు. కానీ సినిమాలో అది సక్సెస్ అయినా.. నిజజీవితంలో మాత్రం బెడిసి కొట్టింది. అక్రమంగా గంజాయి తరలిస్తున్న విషయాన్ని గుర్తించిన పోలీసులు నలుగు నిందితులను అరెస్చ్ చేశారు. వారి వద్ద నుంచి 400 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఎల్బీ నగర్ లో విలేకరుల సమావేశంలో సీపీ డీఎస్ చౌహాన్ వివరాలు తెలిపారు. 


అసలేం జరిగిందంటే..?


హన్మకొండకు చెందిన బానోత్ వీరన్న, హైదరాబాద్ వాసులు కర్రె శ్రీశైలం, కేతావత్ శంకర్ నాయక్, వరంగల్ కు చెందిన పంజా సూరయ్య ముథాగా ఏర్పడి ఏపీలోని అన్నవరం నుంచి రాజమండ్రి, తొర్రూరు, తిరుమలగిరి, అడ్డగూడూరు, మోత్కూరు, వలిగొండ, చౌటుప్పల్ మీదుగా హైదరాబాద్, మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ఓ అదిరిపోయే ప్లాన్ వేశారు. డీసీఎం వాహనం లోపల మార్పులు చేసి ఖాళీ ప్రదేశాన్ని సృష్టించారు. అందులో గంజాయి ప్యాకెట్లను నింపుతున్నారు. దానిపై ఇనుప షీట్లు ఉంచి బోల్టుతో బిగిస్తున్నారు. ఆపై ఏదో ఓ లోడును తీసుకుని నగరానికి పయనం అవుతున్నారు. ఇలా ఆరుసార్లు గుట్టుగా గంజాయిని అనుకున్నచోటుకు తరలించారు. వాహనంలో గంజాయి తరలుతోందని చౌటుప్పల్ పోలీసులకు ఉప్పందింది. డీసీఎంకు ముందు ఓ హ్యుందాయ్ క్రెటా కారును పైలెట్ లో పంపిస్తూ.. జాగ్రత్త పడుతున్నారని సమాచారం అందింది. శనివారం తెల్లవారుజాము 4 గంటల సమయంలో చౌటుప్పల్ లోని వలిగొండ చౌరస్తాలో పోలీసులు కాపు కాశారు. పైలెట్ గా వచ్చిన కారును అడ్డుకుని ఆ వెనకే వచ్చిన డీసీఎంను ఆపారు. అనుమానంతో వాహనం లోపలి భాగాన్ని కాలితో తన్ని చూడగా.. శబ్దంలో తేడా వచ్చింది. ఇనుప షీట్లపై బోల్టులు తొలగించడంతో 400 కిలోల గంజాయి ఉంది. కారులో వచ్చిన ఇద్దరితో పాటు డీసీఎంలో వెళ్తున్న మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.