Varupula Raja Passed Away: టీడీపీ నేత, ప్రత్తిపాడు నియోజకవర్గ ఇంఛార్జ్‌ వరుపుల రాజా మరణవార్తపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం జగన్ సూచించారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. వరుపుల రాజా భౌతికకాయానికి వైసీపీ నేతలు ఆదివారం నివాళులర్పించారు. రాజా గతంలో తమతో కలిసి పనిచేశారని, అన్ని పార్టీల వారితో ఆయన స్నేహంగా మెలిగేవారని కన్నబాబు తదితరులు గుర్తుచేసుకున్నారు. 


టీడీపీ నేత వరుపుల రాజా  గుండెపోటుతో హఠాన్మరణం చెందడం తెలిసిందే. వైసీపీ నేతలు ఎంపీ వంగా గీత, మాజీ మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, ఏపీ గృహనిర్మాణ సంస్థ ఛైర్మన్‌ దొరబాబు, మరికొందరు నేతలు వరుపుల రాజా మృతికి సంతాపం తెలిపారు. టీడీపీ నేత కుటుంబాన్ని ఓదార్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్తిపాడు బయలుదేరారు. వరుపుల రాజా భౌతికకాయానికి చంద్రబాబు సహా టీడీపీ నేతలు నివాళులు అర్పించనున్నారు.


ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా డిసిసిబి మాజీ ఛైర్మన్ వరుపుల రాజా (46) హఠాన్మరణం చెందారు. ఆయన ప్రస్తుతం ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ గా వ్యవరిస్తున్నారు. అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు ఆయనను కాకినాడ అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే పరిస్థితి విషమించి చికిత్స పొందుతూనే గుండెపోటుతో వరుపుల రాజా మృతి చెందారని సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంతో చురుకుగా పాల్గొంటున్న నేత అకాల మరణంపై పార్టీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.


తెలుగుదేశం ప్రభుత్వ హాయాం లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీ అధ్యక్షునిగా రాజా పనిచేశారు. వరుపుల రాజా అసలు పేరు జోగిరాజు కాగా అందరూ ఆయన్ను రాజా అని పిలుస్తుంటారు. 2004 లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన రాజా గతంలో ఆఫ్కాబ్ వైస్ చైర్మన్ గా కూడా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గా పనిచేశారు. వరుపుల రాజా రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీ తో ప్రారంభమైంది.  2019 సార్వత్రిక ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. వరుపుల రాజా 1977లో జన్మించారు. రాజా 1997లో ఆంధ్రా యూనివర్శిటీలో బి.కామ్ విద్యను పూర్తి చేశారు. తాజాగా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్‌ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు చిరంజీవిరావుకు వేసి గెలిపించాలని ఆయన కోరారు. కానీ రోజు వ్యవధిలోనే గుండెపోటు రావడంతో ఆయన కన్నుమూశారు. 


వరుపుల రాజా మృతికి టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం..
టీడీపీ నేత, ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్‍చార్జ్ వరుపుల రాజా మృతి పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu) దిగ్భ్రాంతి  వ్యక్తం చేశారు. గుండెపోటుతో రాజా మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రాజా మృతి పార్టీ కి తీరని లోటని అన్నారు. వరుపుల రాజా కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.