Heavy Fire Accident In Jeedimetla Industrial Area: హైదరాబాద్ పరిధి జీడిమెట్ల (Jeedimetla) పారిశ్రామికవాడలోని దూలపల్లిలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ కెమికల్ గోదాంలో భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి. ఈ క్రమంలో దట్టమైన పొగలు వ్యాపించగా స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది 2 ఫైరింజన్లతో అక్కడకు చేరుకుని తీవ్రంగా శ్రమించి మంటలు అదుపు చేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో దూలపల్లిలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఎలాంటి అనుమతులు లేకుండా కెమికల్ గోదాంను నిర్వాహకులు నడుపుతున్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు.
గోదాంలో నిల్వ ఉంచిన మెథనాల్, బెంజిన్, పెరడిన్ రసాయనాలు మండడంతో దట్టమైన పొగలతో స్థానికంగా ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని పోలీసులు తెలిపారు. ఎలాంటి అనుమతులు లేని కెమికల్ గోదాంలు జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అనేకం ఉండగా..
కెమికల్ కంపెనీల్లో వాడిన వేస్ట్ కెమికల్స్‌ను కంపెనీ యాజమాన్యాలు రసాయనాల గాఢతను తగ్గించి వేస్ట్ మేనేజ్మెంట్ రాంకీ కంపెనీకి తరలించాల్సి ఉంది. ఇది ఖర్చుతో కూడిన వ్యవహారం కావడంతో అనుమతులు లేకుండా ప్రమాదకరమైన రసాయనాలను నిల్వ ఉంచడం సంబందిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. పైర్ సిబ్బంది పోన్ సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
