Served chicken biryani instead of veg customer murder restaurant owner: జార్ఖండ్ రాజధాని రాంచీలో బిర్యానీ ఆర్డర్ వివాదం హత్యగా మారిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కాంకే-పిథోరియా రోడ్డుపైన ఉన్న చౌపట్టి రెస్టారెంట్ యజమాని విజయ్ కుమార్ నాగ్  ను ఓ కస్టమర్ కాల్చి చంపాడు. వెజిటేరియన్ బిర్యానీ ఆర్డర్ చేసిన తనకు నాన్-వెజ్ బిర్యానీ ఇచ్చారని ఆరోపిస్తూ ఈ  హత్య  చేశారు.  అక్టోబర్ 18  శనివారం  రాత్రి 11:30 గంటల సమయంలో ఈ  ఘటన జరిగింది. పోలీసులు నిందితుడ్ని అభిషేక్ కుమార్ నాగ్‌ను గుర్తించారు. 
  
కాంకే పోలీస్ స్టేషన్ పరిధిలోని భిత్తా గ్రామానికి చెందిన విజయ్ కుమార్ నాగ్, రాంచీలోని కాంకే-పిథోరియా రోడ్డుపై చౌపట్టి రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి అభిషేక్ కుమార్ నాగ్ అనే కస్టమర్ వెజిటేరియన్ బిర్యానీని పార్సెల్‌గా తీసుకుని ఇంటికి వెళ్లాడు. ఇంటికి చేరుకుని ప్యాకెట్ తెరిచి చూస్తే అందులో చికెన్ ముక్కలు, ఎముకలు ఉన్నాయని గుర్తించాడు. దీంతో ఆగ్రహానికి గురైన అభిషేక్, రెస్టారెంట్ యజమాని విజయ్‌కు ఫోన్ చేసి వాదనకు దిగాడు.                             

Continues below advertisement


ఆ తర్వాత అభిషేక్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి రెస్టారెంట్‌కు తిరిగి వచ్చాడు. అప్పటికే విజయ్ రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్నాడు. ఇరు వర్గాల మధ్య మాటలు కలిసి, దాడి, తోపులాటకు దారితీసింది. ఆవేశంతో అభిషేక్ తన వద్ద ఉన్న పిస్టల్ తీసి విజయ్ ఛాతీపై కాల్పులు జరిపాడు. విజయ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. నిందితులు కారులో పారిపోయారు. గన్‌షాట్ సౌండ్ విని స్థానికులు రెస్టారెంట్ వద్దకు చేరుకున్నారు.                        


విజయ్‌ను తక్షణమే రాంచీలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతడిని చనిపోయినట్టు ధృవీకరించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు పంపారు. కాంకే పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ప్రకాశ్ రాజక్ నేతృత్వంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రాంతాన్ని మూసివేశారు. రెస్టారెంట్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. నిందితులను 24 గంటల్లో అరెస్ట్ చేస్తామని పోలీసులు ప్రకటించారు.     



ఘటన విషయం తెలిసిన వెంటనే స్థానికులు, మృతుడి కుటుంబ సభ్యులు రెస్టారెంట్ ముందు కాంకే-పిథోరియా రోడ్డును బ్లాక్ చేసి నిరసన తెలిపారు. నిందితులను 24 గంటల్లో అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో కొన్ని గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు, స్థానిక నాయకులు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. లేకుంటే నగరవ్యాప్త నిరసనలు చేస్తామని కుటుంబ సభ్యులు హెచ్చరించారు.