Crime News :  మార్చి మూడో తేదీన  రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం మోకిల పోలీస్ స్టేషన్ పరిధి టంగుటూరు గ్రామంలో ఓ తండ్రి తన ముగ్గురు కుమారులను హత్య చేసి తాను ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన అందర్నీ కలచి వేసింది. అంత కష్టం ఏమి వచ్చిందని చర్చించుకున్నారు. పోలీసులు తాజాగా వివరాలు బయట పెట్టారు.అసలే మోసపోయి సర్వం కోల్పోతే మీడియా పేరుతో కొంత మంది బ్లాక్ మెయిలింగ్ కు దిగడంతో బిడ్డలతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు ఆ తండ్రి. 


చిరుద్యోగు చేసుకునే నీరటి రవికి గుంటూరులో గండం 


మోకిల పోలీస్ స్టేషన్ పరిధి టంగుటూరు గ్రామానికి చెందిన  నీరటి రవి ఓ అగ్రికల్చర్ ఆఫీస్ లో సూపర్ వైరజర్ గా పని చేసే సమయంలో 2022లో కంపెనీ పనిమీద ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరుకు వెళ్లాడు. అక్కడ మనీ సర్క్యులేషన్ కు సంబంధించిన జీఎస్ఎన్ ఫౌండేషన్ ప్రతినిధి తిరుపతిరెడ్డితో రవికి పరిచయం ఏర్పడింది. తమ సంస్థలో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని రవిని అందులో తిరుపతి రెడ్డి చేర్పించాడు. ముందుగా రూ.2 వేలు కడితే 45 రోజుల తర్వాత కట్టిన డబ్బులు మొత్తం తిరిగి ఇచ్చి ఆ తర్వాత ప్రతినెల రూ. 1000 చొప్పున ఆరు నెలల వరకు ఇస్తామని ఆశ పెట్టాడు. మొదట్లో డబ్బులు ఇచ్చాడు. తర్వాత ఏజెంట్‌గా చేరాలని సూచించాడు. 


పరిచయస్తులతో డబ్బులు కట్టించిన నీరటి రవి 
 
డబ్బులు తిరిగి వస్తుండటంతో రవి తన గ్రామాస్తులతో పాటు తన పరిచయస్తులను ఈ స్కీమ్ లో చేర్పించాడు. వారి వద్ద నుంచి సేకరించిన డబ్బులను రవి తిరుపతి రెడ్డికి   పంపించేవాడు. కొంత కాలం డబ్బులు పంపిన తిరుపతి రెడ్డి.. తర్వాత పంపడం ఆపేశాడు. దీంతో డబ్బులు కట్టిన వారంతా తమ డబ్బులు ఇచ్చేయాలని రవిపై తరచూ ఒత్తిడి తీసుకువచ్చారు.తిరుపతి రెడ్డి మోసం చేశాడని తెలుసుకున్న నీరటి రవి ఆస్తులు అమ్మి అందరికీ వీలైనంత వరకూ ఇస్తున్నాడు. 


విషయం తెలిసి తమకూ డబ్బులివ్వాలని  మీడియా ప్రతినిధుల బెదిరింపులు 


మనీ సర్క్యూలేషన్ స్కీమ్ పేరుతో డబ్బులు వసూలు చేశారని.. తెలుసుకున్న స్థానిక మీడియా కంట్రిబ్యూటర్లు తమకు రూ.20 లక్షలు ఇవ్వాలని రవిని బెదిరించారు. లేకపోతే జీఎస్ఎన్ ఫౌండేషన్ పేరు మీద పబ్లిక్ వద్ద డబ్బులు కట్టించి వారికి తిరిగి ఇవ్వకుండా మోసం చేశావని  వార్తలు రాస్తామని బ్లాక్ మెయిల్ చేశారు.   ఈ క్రమంలో  మిగతా డబ్బుల కోసం స్కీమ్‌లో పెట్టుబడి పెట్టిన వారు, విలేకరులు ఒత్తిడి చేయడంతో భరించలేకపోయిన రవి  మార్చి   3వ తేదిన రాత్రి తన ముగ్గురు కుమారుల మెడకు తాడు బిగించి చంపేశారు.  


కీలక విషయాలు బయట పెట్టిన పోలీసులు  


నీరటి రవి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను గుర్తించారు.  ఈ కేసులో  పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఏ1- తిరుపతి రెడ్డి, ఏ2- మంగలి శ్రీనివాస్ (ఆంధ్రజ్యోతి రిపోర్టర్), ఏ3- కురుమ శ్రీనివాస్ (ఈనాడు రిపోర్టర్), ఏ4- వడ్డే మహేష్ (నమస్తే తెలంగాణ రిపోర్టర్), ఏ5- సిరిపురం శ్రీనివాస్ రెడ్డి-(వార్తా రిపోర్టర్), ఏ6 - సంకే ప్రవీణ్ కుమార్- (సాక్షి రిపోర్టర్), ఏ7 - ఆలూరు రాజు (హోం గార్డు), ఏ8 - మనీలా, ఏ9 - రామకృష్ణలు నిందితులుగా ఉన్నారని పోలీసులు తెలిపారు. 


డబ్బులు వసూలు చేసే మీడియా ప్రతినిధులకు పోలీసు హెచ్చరిక 
 
పోలీసులు డబ్బులు వసూలు చేస్తున్న రిపోర్టర్లకు హెచ్చరిక జారీ చేశారు. విలేకర్లు, మరే ఇతర రంగాలకు చెందిన వ్యక్తులు ఎవరినైనా బెదిరించి డబ్బులు వసులూ చేసినా, అలా చేయడానికి ప్రయత్నించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే అధిక డబ్బులు వస్తాయని దురాశతో మోసపూరిత స్కీమ్ లు, ఆన్ లైన్ యాప్ లలో డబ్బులు పెట్టి మోసపోవద్దని ప్రజలకు సూచించారు.