Cherlapalli Drugs Factory Case: అనగనగగా ఓ పోలీసు. అతను ఓ పెద్ద డ్రగ్స్ ముఠాను పట్టుకోవాలనుకున్నాడు. అంతే అండర్ కవర్ పోలీసుగా మారిపోయాడు.డ్రగ్స్ ముఠాలోనే ఓ కూలీగా చేరిపోయాడు. గుట్టు అంతా తెలుసుకుని ఆ ముఠా సంగతి తేల్చాడు. ఈ లైన్లు వింటే మీకు చాలా సినిమాలు గుర్తుకు వస్తాయి. కానీ నిజంగానే ఇది లెట్సెట్గా జరిగింది. చర్లపల్లిలో బయటపడిన డ్రగ్స్ ముఠా వ్యవహారంలో ఇదే జరిగిందని ముంబై పోలీసులు చెబుతున్నారు.  

ముందస్తుగా కూలీగా చేరిన ఓ ముంబై కానిస్టేబుల్       

చర్లపల్లి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నెల రోజుల ముందే వాగ్దేవి కెమికల్స్ ల్యాబ్‌లో రోజువారీ కూలీగా చేరిన ముంబై కానిస్టేబుల్‌.. అక్కడి ముడి సరుకులు, రసాయనాలు, డ్రగ్స్ తయారీపై నిఘా ఉంచారు.  పక్కా ఆధారాలు సేకరించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. డ్రైవర్లు, రోజువారీ కూలీలుగా మరికొంత సిబ్బందిని పంపిన ముంబై బ్రాంచ్ డ్రగ్స్ అని నిర్ధారించుకున్న తర్వాతే అధికారులు సోదాలు నిర్వహించి ముఠాను పట్టుకున్నారు.              

సమాచారం అంతా సేకరించి టీముల్ని రప్పించిన కానిస్టేబుల్        డ్రగ్స్ తయారీ నిర్ధారణ అయిన తర్వాతే అధికారులు సెప్టెంబర్ 6న మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 5.968 కిలోల మెఫెడ్రోన్ (ఎండీ), 35,500 లీటర్ల ముడి రసాయనాలు, 950 కిలోల పౌడర్ పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముడి పదార్థాలతో సుమారు రూ. 12,000 కోట్ల విలువైన డ్రగ్స్ తయారు చేయవచ్చని పోలీసులు అంచనా వేశారు.                   

ముంబైకు తరలించిన సమయంలో  గుట్టు కనిపెట్టిన పోలీసులు                     

ప్రధాన నిందితుడు శ్రీనివాస్ విజయ్ మూర్తి వోలేటి (34), కెమికల్ ఎక్స్‌పర్ట్ తానాజీ పండరీనాథ్ పట్వారీతో కలిసి ఈ రాకెట్‌ను నిర్వహిస్తున్నట్లు తేలింది. వోలేటి గతంలో ఎన్‌సీబీకి పట్టుబడినా,  బెయిల్ పొంది మళ్లీ దందా సాగించాడు. వాగ్దేవి ల్యాబ్స్‌తో పాటు వాగ్దేవి ఇన్నోసైన్స్, అటెంటివ్ టెక్నాలజీస్ వంటి కంపెనీలను కెమికల్ ఫ్యాక్టరీ మాస్క్‌లో డ్రగ్స్ తయారీకి ఉపయోగించారు. డ్రగ్స్‌ను ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాలకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.                     

కెమికల్ ఫ్యాక్టరీపై తెలంగాణ పోలీసుల నిఘా                

ఈగల్ టీమ్, హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ వంటి విభాగాలు ఇప్పుడు ఇత ర ఫార్మా యూనిట్లపై నిఘా పెంచాయి. కెమికల్ ఫ్యాక్టరీల ముసుగులో కొంత మంది డ్రగ్స్ తయారు చేస్తున్నారన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. జీడిమెట్ల పరిసర ప్రాంతాల్లో గతంలో కొన్ని ఇలాంటి కుటీర పరిశ్రమల్ని పట్టుకున్నారు. అయితే ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్ ముఠాను పట్టుకోవడం ఇదే మొదటి సారి.