Sangareddy News : హైదరాబాద్ నుంచి పాకిస్తాన్(Hyderabad To Pakistan) కు అక్రమంగా ట్రమడాల్(Tramadol) డ్రగ్స్ ఎగుమతి జరుగుతోంది. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం(Gaddapotaram) పారిశ్రామికవాడలో ఈ డ్రగ్స్ ను బెంగళూరు ఎన్సీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ కేసులో ఫార్మా కంపెనీ(Pharma Company) డైరెక్టర్ సహా నలుగురిని అరెస్టు చేశారు. నొప్పి నివారణకు వినియోగించే ట్రమడాల్ డ్రగ్ ఎటువంటి అనుమతులు లేకుండా పాకిస్తాన్ కు ఎగుమతి చేస్తున్నారని అధికారులు గుర్తించారు.  గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని ల్యూసెంట్ డ్రగ్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ఈ నిర్వాకానికి పాల్పడింది.  2021ఏడాదిలో 25 వేల కిలోల ట్రమడాల్ డ్రగ్ ను ఎగుమతి చేసినట్లు గుర్తించారు. 



డెన్మార్క్, జర్మనీ, మలేషియాకు డ్రగ్స్ ఎగుమతి 


పటాన్ చెరు లూసెంట్ డ్రగ్స్ కంపెనీ పాకిస్తాన్‌కు అక్రమంగా ట్రమడాల్ డ్రగ్ ఎగుమతి చేస్తుందని బెంగళూరు ఎన్‌సీబీ అధికారులు గుర్తించాుర. ట్రమడాల్‌ డ్రగ్‌ రవాణాను సీరియస్‌గా తీసుకున్న అధికారులు ఆ కంపెనీలు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా పాకిస్తాన్ కు మందులు సరఫరా చేసిన కంపెనీపై ఎన్సీబీ అధికారులు కేసు నమోదు చేశారు. డెన్మార్క్, జర్మనీ, మలేషియాలకు డ్రగ్స్‌ పంపినట్లుగా  ఇన్వాయిస్‌లు లభించాయని ఎన్సీబీ అధికారులు తెలిపారు. లూసెంట్‌ డ్రగ్స్‌ కంపెనీ దొడ్డిదారిన పాకిస్తాన్‌కు డ్రగ్స్‌ ఎగుమతి చేస్తున్నట్లు గుర్తించారు. దీనికి సంబంధించి ల్యూసెంట్ డ్రగ్స్‌(Lucent Drugs) కంపెనీ ఎండీతో పాటు నలుగురు ఉద్యోగులను బెంగళూరు ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు.  


ట్రమడాల్ ఎందుకు వినియోగిస్తారు?


ట్రమడాల్ అనేది ఓపియాయిడ్ మాదిరిగానే నొప్పిని తగ్గించే ఔషధం. సింథటిక్ ఓపియాయిడ్‌గా దీనిని వర్గీకరిస్తారు. ఇది నొప్పిని తగ్గించడానికి కేంద్ర నాడీ వ్యవస్థ (CNS)పై పనిచేస్తుంది. ట్రమడాల్ పెద్దవారిలో తీవ్రమైన నొప్పికి చికిత్సలో ఉపయోగిస్తారు. ట్రమడాల్ ను వైద్యుల సూచన మేరకు మాత్రమే వినియోగించాలి. ట్రమడాల్ తీసుకునే రోగులలో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. వైద్యులు సిఫార్సు చేసిన దానికంటే ఎక్కువ మోతాదులను ఈ డ్రగ్స్ తీసుకుంటే మూర్ఛ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మూర్ఛ రుగ్మత ఉన్నవారిలో లేదా నిర్దిష్ట యాంటిడిప్రెసెంట్స్ లేదా ఓపియాయిడ్ మందులు తీసుకునే వారిలో కూడా మూర్ఛ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. తీవ్రమైన శ్వాస సమస్యలు, కడుపు లేదా ప్రేగులలో అడ్డంకులు ఉన్నట్లయితే ట్రమడాల్ ఉపయోగించకూడదు. మద్యం, మత్తుమందులు, ట్రాంక్విలైజర్లు, మాదక మందులు లేదా MAO ఇన్హిబిటర్ (ఐసోకార్బాక్సాజిడ్, లైన్జోలిడ్, మిథైలీన్ బ్లూ ఇంజెక్షన్, ఫెనెల్జైన్,) ఉపయోగించినట్లయితే ట్రమడాల్ తీసుకోకూడదు. ట్రమడాల్ శ్వాసపై ప్రభావం చూపుతోంది. ఈ ఔషధాన్ని అధిక మోతాదులో ఉపయోగిస్తే మరణానికి కారణమవుతుంది. ముఖ్యంగా పిల్లలలో ప్రిస్క్రిప్షన్ లేకుండా ఔషధాన్ని ఉపయోగించకూడదు.