Sangareddy Crime News: ఇద్దరి అన్నాదమ్ముల మధ్య వచ్చిన భూమి సమస్య రెండు ఇళ్లను నాశనం చేసింది. తమ్ముడి కుమారుడు.. పెద్ద నాన్నపై విపరీతమైన కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే అత్యంత దారుణంగా కత్తితో నరికి హత్య చేశాడు. ఆపై తల, మొండెం వేరు చేసి.. ఒక్కో భాగాన్ని ఒక్కో చోట పడేశాడు. కానీ చివరకు పోలీసులకు చిక్కి ఊచలు లెక్కబెడుతున్నాడు. 


అసలేం జరిగిందంటే...?


సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్ధిపూర్ గ్రామానికి చెందిన చంద్రప్ప, రత్నం అన్నదమ్ములు. వీరికి తాతల నుంచి వచ్చిన వ్యవసాయ భూమి ఉంది. అయితే వీరిద్దరి మధ్య గత కొన్నేళ్లుగా భూవివాదం నడుస్తోంది. ఈక్రమంలోనే రత్నం కుమారుడు రాకేశ్ పెద్ద నాన్నపై విపరీతమైన కోపం పెంచుకున్నాడు. ఆయనను అడ్డుతొలగించుకుంటే భూమి అంతా తమకే దక్కుతుందని.. ఎలాంటి సమస్య ఉండదని భావించాడు. వెంటనే ఇందుకోసం ఓ ప్లాన్ వేశాడు. ముందుగా వెళ్లి చంద్రప్ప వచ్చే రోడ్డులో మాటు వేశాడు. మంగళవారం మధ్యాహ్నం రోజు మాదిరిగా వ్యవసాయ పొలానికి వెళ్లి చంద్రప్ప  తరిగి వస్తుండగా... బర్ధిపూర్ శివారులోని కుప్పానగర్ -ఎల్గొయి రోడ్డు మధ్యలో మాటేసి ఉన్న రత్నం కుమారుడు రాకేశ్.. కత్తితో దాడి చేశాడు. పెద్ద నాన్న అని కూడా చూడకుండా నరికి నరికి చంపాడు. ఆపై తల, మొండెం వేరు చేశాడు. 


తలను ఝరాసంగం శివారులో రోడ్డు పక్కన, మొండెంను మరోచోట విసిరేశాడు. అనంతరం నిందితుడు రాకేశ్ యే నేరుగా వెళ్లి పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఝరాసంగం, హద్నూర్ ఎస్సైలు రాజేందర్ రెడ్డి, వినయ్ కుమార్ దర్యాప్తు చేపట్టారు. హత్య జరిగిన స్థలంలో మృతుడి మోటార్ సైకిల్, వాటర్ బాటిల్, సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. భూవివాదంతోనే రత్నం కుమారుడు పెద్దనాన్న చంద్రప్పను హత్య చేశాడని జహీరాబాద్ రూరల్ సీఐ నోముల వెంకటేష్ తెలిపారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 


వారం రోజుల క్రితమే కరీంనగర్ లో దారుణం - యువకుడి దారుణ హత్య


కరీంనగర్ జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. గొంతు కోసి మరీ చంపేశారు. నగరంలోని విద్యానగర్ వాటర్ ట్యాంక్ సమీపంలోని పీటీసీ రోడ్డులో పురంశెట్టి నరేందర్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మూతపడ్డ ఒక ప్రైవేట్ పాఠశాల ఆవరణలో ఈ దారుణం చోటు చేసుకుంది. అయితే విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈక్రమంలోనే నరేందర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వానికి తరలించారు. అంతకుముందు మృతుడు నరేందర్ తో పాటు మరికొంత మంది ఆ ప్రాంతంలో మద్యం సేవించినట్లు ఆనవాళ్లను గుర్తించారు. మద్యం సేవించిన వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కుటుంబ కలహాలు ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. మృతుడు నరేందర్ సంతోష్ నగర్ నివాసి. అయితే ఇతడు కొద్దీ రోజులు ఆస్ట్రేలియాలో ఉండి ఇటీవల కరీంనగర్ వచ్చాడు.