Sahiti Infra Fraud :   సాహితీ ఇన్ ఫ్రాటెక్  వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇళ్ల కొనుగోలుదారులకు కుచ్చుటోపి పెట్టింది. మేడ్చల్ జిల్లా కొంపల్లి పరిధిలోని గుండ్ల పోచంపల్లి లో లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ కట్టిస్తామని భారీ మోసం చేసింది.  డబ్బులు వసూలు చేసిన నిర్మాణ రంగ సంస్థ ఎంతకూ ఇళ్లు కట్టివ్వకపోవడంతో బాధితులు పోలీసులకు ఫఇర్యాదు చేశారు.  గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో పలువురు ప్లాట్ లను బుక్ చేసుకొని లక్షల్లో డబ్బులు చెల్లించారు.   2020 ఏప్రిల్ నుంచి నిర్మాణాలు ముందుకు సాగక పోగా, కనీసం సమాధానం చెప్పడం లేదని తమ సంస్థకు డబ్బులు ఇచ్చి మోసపోయామని 8 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పేట్ బషీరాబాద్ పోలీసులు. 


మూడు నెలల కిందట అమీన్‌పూర్‌లో ఇదే తరహా మోసం 
 
హైదరాబాద్ శివారులో అమీర్ పూర్ దగ్గర  23 ఎకరాల్లో   సాహితీ ఇన్ఫ్రాటెక్ కంపెనీ వెంచర్ వేసింది. పది టవర్లు నిర్మిస్తామని చెప్పుకుంది. ఆకర్షణీయమైన ప్రకటనలు చేసింది.  ఈ వెంచర్ లో మొత్తం 4300 ఫ్లాట్లు   ఉంటాయని చెప్పి..  2019 జూన్ లో ఫ్రీ లాంచ్ కార్యక్రమం ఏర్పాటు చేసింది.  భారీ ఎత్తున ప్లాటన్లు విక్రయించింది.  ఫ్రీ లాంచ్ లో 1200 మందికి పైగా కస్టమర్లు ఫ్లాట్ కొనుగోలు చేశారు.  2023 మార్చ్ కంత ఇల్లు నిర్మాణం చేసి ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే  గడువు ముగిసే దశకు వస్తున్నా..  ఇప్పటి దాకా నిర్మాణం ప్రారంభించలేదు. కేవలం స్థలం చదును చేసి వదిలేసింది.  ఎలాంటి  బ్యాంక్ లోన్లు లేకుండా ముందుగా డబ్బులు కట్టిన వారికే ప్రీలాంచ్ ఆఫర్లు అనిచెప్పడంతో  చాలా మంది బాధితులు వివిధ మార్గాల్లో డబ్బులు సేకరించి కంపెనీకి కట్టారు. కానీ ఇప్పుడు కంపెనీ అడ్డగోలుగా మోసం చేయడానికి సిద్ధం కావడంతో  బాధితులంతా లబోదిబోమంటున్నారు. చెప్పిన దాని ప్రకారం  ప్లాట్లు మాకు అప్పగించమని అడిగితే యాజమాన్యం బెదిరింపులకు దిగుతోంది.  డబుల్ బెడ్ రూం కి 25 లక్షలు ట్రిబుల్ బెడ్ రూం కి 35 లక్షలు వసూలు చేసిన యాజమాన్యం తమను నట్టేట ముంచిందని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. మొత్తంగా 2000 బాధితుల నుంచి ఇప్పటిదాకా 1500 కోట్లు వసూలు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయింది. 


సాహితీ ఇన్ఫ్రాటెక్ ఎం డి లక్ష్మీనారాయణకు రాజకీయ పలుకుబడి  !


సాహితీ ఇన్ఫ్రాటెక్ ఎం డి లక్ష్మీనారాయణ. అధికార పార్టీ నేతలు.. ఇతర రాజకీయ పార్టీల నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ప్రచారం చేసుకుంటూ డబ్బులు తిరిగి ఇవ్వాలని అంటున్న వారిపై బెదిరింపులకు దిగుతున్నారు. ప్రిలాంచ్ సమయంలో చాలా మాటలు చెప్పారు.. తర్వాత కూడా రకరకాల ప్లాన్లు చెప్పారు. ఈ వ్యవహారం తేడాగా ఉండటంతో కొంత మంది తమ ప్లాట్లను రద్దు చేసుకున్నారు. వారికి కూడా అరకొరగానే  డబ్బులు ఇచ్చారు. అసలు నిర్మాణం చేపట్టకపోగా భూమిని కూడా అమ్మేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లుగా తెలియడంతో బాధితులు రగిలిపోతున్నారు.  పోలీసులు కూడా మా పిర్యాదు పట్టించుకోవట్లేదని బాధితులు వాపోతున్నారు. 


టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్న లక్ష్మినారాయణ ! 
 
టీటీడీ బోర్డు సభ్యుడుగా ప్రస్తుతం సాహితి ఇన్‌ఫ్రాటెక్ ఎండీ  లక్ష్మినారాయణ ఉన్నారు.  జగన్ ప్రభుత్వం తెలంగాణ నుంచి మొత్తం ఐదుగుర్ని టీటీడీ బోర్డులో సభ్యులుగా నియమిస్తే అందులో ఒకరు లక్ష్మినారాయణ.