Rsi Death In Old City: హైదరాబాద్ (Hyderabad) ఓల్డ్ సిటీలో ఆర్ఎస్ఐ మృతి కలకలం రేపింది. పాతబస్తీ కబూతర్ ఖానాలో విధులు నిర్వహిస్తోన్న రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ బాలేశ్వర్ అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. హుస్సేని ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట (Atchampeta) మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన బాలేశ్వర్ మహబూబ్ నగర్ 10వ బెటాలియన్ రిజర్వ్ ఎస్ఐ. విధుల్లో భాగంగా అక్కడి నుంచి శనివారం పాతబస్తీకి వచ్చారు. తెల్లవారుజామున బాలేశ్వర్ విధులు నిర్వహిస్తోన్న సమయంలో ఒక్కసారిగా తుపాకీ శబ్దాలు వినిపించాయి. రెండుసార్లు తుపాకీ పేలడంతో అక్కడే ఉన్న పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా.. ఆయన విగతజీవిగా కనిపించాడు. సమాచారం అందుకున్న డీసీపీ, ఏసీపీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలేశ్వర్ ఆత్మహత్య చేసుకున్నారా.. లేదా గన్ మిస్ ఫైర్ అయ్యిందా అనేది తెలియాల్సి ఉంది. బాలేశ్వర్ కు కుటుంబ కలహాలు, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా.? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. రెండు రౌండ్ల ఫైర్ జరిగిందని పోలీసులు చెబుతున్నారు.


కుటుంబ సభ్యులు ఏమన్నారంటే.?


బాలేశ్వర్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆయనకు భార్య, పిల్లలు ఉన్నారు. బాలేశ్వర్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని వారు కుటుంబ సభ్యులు అంటున్నారు. 'బాలేశ్వర్ కు కుటుంబ వివాదాలు ఏమీ లేవు. ఇది సూసైడ్ కాదని మేం నమ్ముతున్నాం. గన్ మిస్ ఫైర్ వల్ల జరిగింది అని అధికారులు మాతో చెప్పారు. మీడియా మాధ్యమాల్లో సూసైడ్ అని వస్తుంది. శనివారం రాత్రి కూడా బాలేశ్వర్ తో మాట్లాడాం. బాగానే మాట్లాడారు. ఇంతలోనే ఇలా జరిగింది.' అని వారు పేర్కొంటున్నట్లు తెలుస్తోంది.


Also Read: Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై ఇద్దరు యువకుల సెల్ఫీ, ఇంతలో ఊహించని ప్రమాదం - ఒకరు దుర్మరణం