నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న కార్లు ఎదురెదురుగా ఢీకొని 8 మంది ఘటనాస్థలంలోనే మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. అచ్చంపేట మండలం చెన్నారం గేట్‌ సమీపంలో హైదరాబాద్‌ – శ్రీశైలం రహదారిపై ఈ దుర్ఘటన జరిగింది.


నాగర్‌ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం చెన్నారం గేట్‌ వద్ద రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు కార్లలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు.  రోడ్డు ప్రమాదం ధాటికి రెండు కార్లు నుజ్జునజ్జయ్యాయి. ఘటనా స్థలంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మరి కొన్ని మృతదేహాలు కార్లలో చిక్కుకున్నాయి. అతి వేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన ఒకరిని అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


సాధారణంగా.. హైదరాబాద్‌- శ్రీశైలం రహదారిపై చెన్నారం గేటు వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో రెండు కార్లు అతివేగంతో ఎదురెదురుగా ఢీ కొనడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని తెలుస్తోంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని  సహాయక చర్యలు చేపట్టారు. చీకటి పడటంతో సహాయక చర్యలకు ఆటంకమేర్పడిందని సమాచారం. 


సాధ్యమైనంత త్వరగా కార్లలో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసి అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శర్మన్‌ ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. 


ప్రమాదానికి గురైన కార్లలో ఒకటి హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మృతుల వివరాలు సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మృతదేహాల వద్ద లభ్యమైన గుర్తింపు కార్డులు, కారు నంబర్ల ఆధారంగా మృతుల బంధువులకు పోలీసులు సమాచారమిచ్చారు.


చనిపోయినవారంతా హైదరాబాద్‌ వాసులే.ఎదురెదురుగా వస్తున్న 2కార్లు వేగంగా ఢీకొన్నాయి. కార్లలో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీయడానకి స్థానికులు ఎంతో శ్రమించాల్సి వచ్చింది. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన నలుగురు యువకులు కారులో శ్రీశైలం వెళ్లారు. దర్శనం చేసుకుని వస్తున్న వీరి కారు.. ఎదురుగా హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం వైపు వెళ్తున్న కారు ఢీకొన్నాయి.


శ్రీశైలం నుంచి వస్తున్న కారులో ఉన్న తలారి వెంకటేశ్‌(నిజాంపేట), వంశీకృష్ణ(జీడిమెట్ల), కార్తీక్‌(ఆనంద్‌బాగ్‌) స్పాట్‌లోనే చనిపోయారు. నరేశ్‌ (అమీన్‌పూర్‌లోని గండిగూడెం) గాయపడ్డారు. హైదరాబాద్‌ నుంచి వస్తున్న కారులో ట్రావెల్ చేస్తున్న శివకుమార్‌, ఆయన తల్లి సుబ్బలక్ష్మి, బంధువులు వెంకటమూర్తి, లవమూర్తి కూడా స్పాట్‌లో చనిపోయారు. శివకుమార్‌ సికింద్రాబాద్‌ ప్యారడైజ్డ్‌ హోటల్‌ మేనేజర్‌. తన సహ ఉద్యోగి కారు తీసుకొని శ్రీశైలం బయల్దేరారు. వీరిది హైదరాబాద్‌లోని ఈస్ట్‌ ఆనంద్‌బాగ్‌గా పోలీసులు గుర్తించారు. శ్రీశైలం నుంచి వస్తున్న కారులో ప్రయాణిస్తున్న వారు నలుగురు స్నేహితులు అని తెలిపారు. 


 


Also Read: ys viveknanda reddy murcer case : వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక పరిణామం... రంగయ్య స్టేట్‌మెంట్ రికార్డు