Kurnool Crime News | ఆదోని: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదోని మండలం పాండవగల్లు సమీపంలో  కర్ణాటక ఆర్టీసీ బస్సు కంట్రోల్ తప్పి, రెండు బైక్‌లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. హాస్పిటల్ కు తరలించగా కొంత సమాయానికే అతడు కూడా చనిపోవడంతో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. గంగావతి డిపోకు చెందిన బస్సు ఆదోని నుంచి రాయచూరు వెళ్తుంటే ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పెద్దతుంబలం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.


అసలేం జరిగిందంటే..
కుప్పగళ్‌ గ్రామానికి చెందిన వీరన్న, ఆదిలక్ష్మిలు బైకుపై వెళ్తున్నారు. కర్ణాటకకు చెందిన దేవరాజు, హేమాద్రి,  నాగరత్న మరో బైక్‌పై వీరి వెనుక ప్రయాణిస్తున్నారు. పాండవగల్లు సమీపానికి రాగానే కర్ణాటక ఆర్టీసీ బస్సు ఈ రెండు బైకులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దేవరాజు, నాగరత్న, వీరన్న, ఆదిలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన హేమాద్రిని చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా కొంత సమయానికే అతడు కూడా చనిపోయాడు. భారీ రోడ్డు ప్రమాదం కావడంతో ఆదోని డీఎస్పీ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అతివేగం, నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు పోతాయని రోడ్డుపై వాహనాలు నడిపే వారు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.