Road Accident At Tadepalligudem: ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. తొలి రోజైన భోగితో ఏపీ ప్రజలు సంబురాలు జరుపుకుంటుండగా పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. చేపల లోడ్ లారీ దువ్వాడ నుండి నారాయణపురం వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది.
చేపల లోడుతో వస్తున్న లారీ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నిట్ కాలేజీ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు చనిపోయారు. లారీలో ప్రయాణిస్తున్న మరో ఆరుగురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. లారీలో మొత్తం 14 మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం తాడేపల్లిగూడెంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ మద్యం మత్తు వల్లే లారీ బోల్తా పడి ప్రమాదం జరిగి ఉండొచ్చునని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
Also Read: Bhogi Wishes in Telugu: భోగ భాగ్యాల భోగి రోజు.. ఇలా శుభాకాంక్షలు చెప్పండి
చేపల లోడ్ లారీ బోల్తా పడిన విషయం తెలియగానే స్థానికులు అక్కడికి చేరుకున్నారు. చేపలను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సహాయంతో చేపలను ట్రేలలో సర్దిస్తున్నారు. లారీ ఓనవర్ వివరాలపై క్షతగాత్రులను పోలీసులు ఆరా తీస్తున్నారు. అతివేగం, నిద్రమత్తు లాంటి విషయాల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని జాగ్రత్తగా వాహనాలు నడపాలని పోలీసులు సూచించారు.