Srikakulam Reporter Suicide News : శ్రీకాకుళం జిల్లా రణస్థలం(Ranasthalam)లో ఓ రిపోర్టర్ ఆత్మహత్య జిల్లాలోనే సంచలనంగా మారుతోంది. దీని వెనుక అధికార పార్టీకి చెందిన నేతలు ఉన్నారనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ ఆయన పని చేసే సంస్థ కూడా అధికారపార్టీకి చెందినది కావడంతో మరింత ఆతృత ఏర్పడింది.
24 గంటల టెన్షన్
రణస్థలంలో పని చేస్తున్న దామోదర్ ఓ ప్రముఖ దినపత్రికలో రిపోర్టర్‌గా పని చేస్తున్నారు. ఆయన మంగళవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. రాత్రి అయినా ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గంటలు గడుస్తున్నా ఆచూకీ లభించకపోవడంతో జిల్లా మీడియా గ్రూపుల్లో కూడా చర్చనీయాంశమైంది. ఆయన ఫొటో, ఆయన రోజూ తిరిగే బండి నెంబర్‌ను సోషల్ మీడియా పెట్టిన మిత్రులు ఆచూకీ తెలపాలని రిక్వస్ట్ పెట్టారు. అయితే గురువారం ఉదయం రణస్థలం సమీపంలో దామోదర్ నడిపే స్కూటీని గుర్తించారు స్థానికులు
జీడితోటలో మృతదేహం
స్థానికంగా ఉండే జీడి తోటల్లో స్కూటీని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడ వెతికి చూడగా జీడి తోటల్లో విగతజీవిగా దామోదర్ పడి ఉన్నాడు. అదృశ్యమైన 24 గంటల్లోనే ఇలా చనిపోయిన దామోదర్‌ను చూసి కుటుంబ సభ్యులు బోరుమని విలపించారు. వారితోపాటు మీడియాలోని ఆయన మిత్రులు కూడా కంటతడి పెట్టుకున్నారు.
సూసైడ్ లెటర్ చుట్టూ వివాదం
దామోదర్ మృతదేహాన్ని పరిశీలించిన జెఆర్‌పురం పోలీసులు ఆయన జేబులో ఉన్న లెటర్ స్వాధీనం చేసుకున్నారు. ఆ విషయాలు బయట పెట్టకుండా ఉండటంతో ఏదో జరిగిందన్న అనుమానం ఎక్కువైంది. కుటుంబ సభ్యులతోపాటు స్థానిక ప్రజలు, మీడియా వర్గాల్లో కూడా అనేక కొత్త డౌట్స్ వచ్చాయి. ఈ ఆత్మహత్య వెనుక పెద్దోళ్లు ఉన్నారనే విషయాన్ని బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డట్టు చెప్పుకుంటున్నారు.
ఈ లెటర్ చుట్టూ వివాదం అలుముకోవడంతో చివరకు ఫొటో తీసి పోలీసులు కుటుంబ సభ్యులకు చూపించారు. అంతే కానీ లెటర్ మాత్రం ఎవరికీ చూపించడం లేదు. అయితే అందులో ఎచ్చెర్ల ఎమ్మెల్యే పేరు, కావేరి మండలం కార్యకర్త గోపి పేరు ఉందని ప్రచారం జరుగుతోంది. అందుకే పోలీసులు గోప్యత పాటిస్తున్నారనే ఆరోపణలకు బలం చేకూరుతోంది. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం దామోదర్ జేబులో దొరికిన లెటర్‌లో ఏముందో చెప్పడం లేదు.
స్థానికంగా మంచిపేరు
ఎచ్చెర్ల నియోజకవర్గ పరిధిలోని లావేరు మండలంలో పని చేసే దామోదర్ వివాదరహితుడని, సౌమ్యుడని స్థానికులు చెబుతున్నారు. మండలంలోనే కాకుండా జిల్లాస్థాయిలోనే మంచి పేరుందని అంటున్నారు. అటువంటి దామోదర్ సడెన్‌గా సూసైడ్ చేసుకోవడం అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది. రణస్థలం మండలంలోని సీతంవలస సమీపంలోని జీడితోటల్లోకి వెళ్లి కూల్‌డ్రింక్‌బాటిల్‌లో పురుగుల మందు కలిపి తాగి చనిపోయాడు. ఆయన స్వస్థలం లావేరు మండలంలోని లావేటిపాలెం.
మంచి వ్యక్తి ఇలా ఆత్మహత్యకి పాల్పడి మృతి చెందడం వారందరిని కూడా తీవ్రంగా కలిచివేసింది. ఆయన ఆత్మహత్యకి బలమైన కారణమే ఉండిఉంటుందని లెటర్ లోని వివరాలు పోలీసులు బయటపెట్టి అందులో పేర్కొన్న అంశాలపై లోతైన దర్యాప్తు చేపట్టిన బాధిత కుటుంభానికి న్యాయం చేయాలని విలేకరులు డిమాండ్ చేసారు.