మేజర్లయిన ఇద్దరు కలిసి ఉండటం నేరం కాదని గతంలో పలు కోర్టులు తీర్పులు చెప్పాయి. అయితే అక్కడ కొన్ని షరతులు వర్తిస్తాయి. ఇద్దరిలో ఎవరికైనా వేరే వారితో పెళ్లయి ఉంటే మాత్రం వారిద్దరూ కలిసి ఉండటం చట్టం ప్రకారం సమ్మతం కాదు. అది వివాహేతర బంధమే అవుతుంది. రాజస్థాన్ హైకోర్టు మరోసారి ఈ విషయాన్ని స్పష్టం చేసింది. తాము ఇద్దరం మేజర్లమని.. తాము ఇద్దరమూ ఇష్ట ప్రకారం కలిసి జీవిస్తున్నామని..  పెళ్లి చేసుకోకపోయినా దంపతుల్లాగే ఉంటున్నామని కానీ పెద్దల నుంచి ముప్పు ఉందని.. తమను రక్షించాలని .. రక్షణ కల్పించాలని ఓ జంట రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు వారి మధ్య బంధం చట్ట సమ్మతం కాదని స్పష్టం చేసింది. భద్రత కల్పించేలా ఆదేశాలివ్వడానికి నిరాకరించింది. దీనికి కారణం ఆ జంటలో మహిళకు అప్పటికే పెళ్లి అవడమే. 


రాజస్థాన్‌లోని జున్‌జును జిల్లాకు చెందిన 30 ఏళ్ల మహిళ, 27 ఏళ్ల యువకుడు సహజీవనం చేస్తున్నారు. మహిళకు ఇందకు ముందే పెళ్లయింది. అయితే భర్త గృహహింసకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. 27 ఏళ్ల యువకుడితో కలిసి ఉంటోంది. ఇద్దరూ పెళ్లి చేసుకోకపోయినా దంపతుల్లాగానే సహజీవనం చేస్తున్నారు. అయితే వీరికి ఇటీవలి కాలంలో వారి పెద్దల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. అందుకే హైకోర్టును ఆశ్రయించారు. కానీ హైకోర్టు మాత్రం... మహిళకు పెళ్లయి ఉన్నందున  వారి మధ్య బంధం చట్ట సమ్మతం కాదని తేల్చింది. 


పిటిషనర్లలో ఒకరైన మహిళ ఇప్పటికే వివాహం జరిగిందని.. ఆమె విడాకులు తీసుకోలేదని న్యాయమూర్తి గుర్తు చేశారు. చట్ట బద్ధంగా పెళ్లి చేసుకున్న భర్త ఉన్నప్పటికీ.. విడాకులు తీసుకోకుండా మరో వ్యక్తితో సహజీవనం చేస్తే అది వివాహేతర బంధం కిందకే వస్తుందని రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శర్మ స్పష్టంచేశారు. ఇటువంటి సంబంధాలకు రక్షణం కల్పించడం అంటే పరోక్షంగా అంగీకారం తెలిపినట్లుగా అవుతుందని అందుకే.. రక్షణ కల్పించాలన్న ఆదేశాలను కూడా ఇవ్వలేమని రాజస్థాన్ హైకోర్టు స్పష్టం చేసింది. అయితే వారికి ఎలాంటి ఆపద వచ్చినా పోలీసుల్ని సంప్రదించవచ్చని హైకోర్టు సూచించింది.


ఇద్దరు మేజర్లు అయినంత మాత్రాన ఇష్టారీతిన సంబంధాలు పెట్టుకోవడం కుదరదని వారిద్దరికీ ఇంతకు ముందు చట్టబద్ధమైన వివాహబంధం ఉండకూడదని రాజస్థాన్ హైకోర్టు తీర్పుతో స్పష్టమైంది. పెళ్లి కాని మేజర్లయిన ఇద్దరు యువతీ యువకులు ... సహజీవనం చేస్తే వారికి ఏమైనా ఆపద ఉంటుందని వారు భావిస్తే అలాంటివారికి రక్షణ కల్పించవచ్చు కానీ..  వివాహేతర బంధాలకు కాదని రాజస్థాన్ హైకోర్టు చాలా క్లారిటగా చెప్పినట్లయింది.