Rajasthan 65 year old mutilated for silver anklets రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ జిల్లా గంగాపూర్ సిటీలో దొంగలు అత్యంత దారుణానికి ఒడిగట్టారు. 65 ఏళ్ల మహిళ కమలా దేవి  వెండి కడియా కోసం  దుండగులు ఆమె పాదాలను కట్ చేశారు. ఈ ఘటనకు ముందు ఆమెకు రొట్టెలు పెట్టారు వాటిని తిన్న తర్వాత ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దాంతో వారు కాళ్లు నరికేసి కడియాలు తీసుకుని వెళ్లిపోయారు.  బాధితురాలు ప్రస్తుతం జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ (SMS) హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. పోలీసులు అనుమానిత దొంగల్ని పట్టుకున్నారు. వారు భార్యభర్తలుగా గుర్తించారు. రామోతర్ అలియాస్ కాడు బైర్వా (32), అతని భార్య తాను అలియాస్ సోనియా (భైసా నివాసి) ఈ ఘోరానికి పాల్పడినట్లుగా గుర్తించారు. వీరు గతంలోనూ ఇలాంటి ఘోరాలకు పాల్పడినట్లుగా గుర్తించారు. 

Continues below advertisement

కమలా దేవి తన కుమార్తె ఇంటికి వెళ్లేందుకు  గంగాపూర్ సిటీలో వచ్చారు. అక్కడ  రామోతర్‌ వారితో మాట్లాడారు.  కుమార్తె ఇంటి వద్ద దిగబెడతానని నమ్మించి వృద్ధురాలితో పాటు మరో ముగ్గురిని తన వాహనంలో ఎక్కించుకుని గంగాపూర్ సిటీ బైపాస్‌కు తీసుకెళ్లాడు.   మొదట మరో ముగ్గురిని డ్రాప్ చేసి, తర్వాత కమలా దేవిని తన భార్యతో కలిపి బైపాస్‌లో కూర్చోబెట్టాడు.

సాయంత్రం 8 గంటలకు  నిందితుడు వృద్ధురాలిని తన  ఇంటికి తీసుకెళ్లాడు. "పెద్దమ్మ, ఈ రోజు  కుమార్తె ఇంటికి తీసుకెళ్లలేను.. రేపు  తీసుకెళ్తా" అని చెప్పి  పరాటా, రొట్టెలు తినమని ఇచ్చాడు. తర్వాత ఆమెకు మగత ఆవహించింది. అక్కడ్నుంచి వృద్ధురాలిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె స్పృహ కోల్పోయింది.  తర్వాత వారు ఆమె  కాళ్లను నరికేసి.. వెండి కడియాలు దోచుకుని ఆమెను అక్కడ పడేసిపోయారు. తెల్లవారిన తర్వాత కాళ్లు నరికేసిన వృద్ధురాలిని కొంత మంది గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు.  ఆమెను గంగాపూర్ హాస్పిటల్‌కు తరలించారు. 

Continues below advertisement

 

హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మీడియాతో మాట్లాడిన కమలా దేవి తన కాళ్లు నరికిన వైనాన్ని వివరించి కన్నీరు పెట్టుకున్నారు.  గంగాపూర్ సిటీ పోలీసులు వారి మొబైల్ లొకేషన్ ట్రాక్ చేసి, నిందితులు గుర్తించారు. నిందితులు ఒంటరిగా ఉన్న మహిళల్ని నమ్మించి ఒంటరి ప్రదేశాలకు తీసుకెళ్లి కాళ్లు కట్ చేసి వెండి కడియాలు దోచుకుంటారని పోలీసులు గుర్తించారు.           

ఈ ఘటన రాజస్థాన్ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చిన్న చిన్న  ఆభరణాల కోసం ఆమె కాళ్లను అత్యంత కిరాతకంగా నరికేసిన ఆ దారుణమైన దంపతుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.