ఏళ్లుగా తప్పించుకు తిరుగుతూ మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న అంతర్రాష్ట్ర దొంగను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. అతను దమ్ముంటే తనను పట్టుకోవాలని గతంలో పోలీసులకు సైతం సవాలు విసిరాడు. అందుకు తన ఫోటో, అడ్రస్ కూడా ఇచ్చి చేతనైతే పట్టుకోవాలని ఛాలెంజ్ చేశాడు. దీన్ని సవాలుగా తీసుకున్న నగర పోలీసులు అతణ్ని ఎట్టకేలకు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్యేంద్ర సింగ్‌ షెకావత్‌ అనే ఖరీదైన కార్ల దొంగ రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ఆర్మీ మాజీ జవాను కుమారుడు. ఎంబీఏ చదివాడు. కేవలం ఖరీదైన లగ్జరీ కార్లనే టార్గెట్‌గా చేసుకుని 2003 నుంచి ఇలా దొంగతనాలు చేస్తున్నాడు. ఇప్పటిదాకా ఏకంగా 10 రాష్ట్రాల్లో 61 నేరాలు చేశాడు. ఇతడిపై హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండల్లోనూ 5 కేసులు ఉన్నాయి. ఇతణ్ని ఈ ఏడాది మార్చిలోనే బెంగళూరులోని అమృతహల్లి పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం పీటీ వారెంట్‌పై తమ కస్టడీలోకి తీసుకున్నట్లుగా బంజారాహిల్స్‌ పోలీసులు చెప్పారు.


కార్లకు నకిలీ తాళాలు తయారు చేయడానికి అవసరమైన సంరంజామాను ఇతను చైనా నుంచి దిగుమతి చేసుకున్నాడు. ఒక కారు ఇంజిన్‌ నంబర్, ఛాసిస్ నెంబర్‌ ఆధారంగా ఇతను దాని తాళం తయారు చేస్తుంటాడని పోలీసులు వెల్లడించారు. ఇటీవల తాళం వాడకుండానే అది మనదగ్గరుంటే కారు స్టార్ట్ చేసే వెసులుబాటు వచ్చిన నేపథ్యంలో అలాంటి వాటిని కూడా దొంగిలించడానికి ఖరీదైన ఎక్స్‌టూల్‌ ఎక్స్‌–100 ప్యాడ్‌ అనే పరికరం వాడుతున్నట్లు గుర్తించారు


ఈ దొంగపై 2003 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంతో పాటు కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, మధ్యప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, డయ్యూడామన్, ఉత్తర ప్రదేశ్‌ల్లో 58 వాహనాలు దొంగిలించాడు. వీటితో పాటు రెండు దోపిడీ, ఓ ఆయుధ చట్టం కేసులు కూడా సత్యేంద్ర సింగ్‌ షెకావత్‌పై ఉన్నాయి.


బంజారాహిల్స్‌ పోలీస్ ‌స్టేషన్‌ పరిధిలోని ఓ స్టార్‌ హోటల్‌లో గతేడాది జనవరి 26న కూడా కన్నడ నిర్మాతకు చెందిన ఓ ఖరీదైన కారును దొంగిలించాడు. ప్రొడ్యూసర్‌ వి.మంజునాథ్‌ కారు దొంగిలించడంతో పోలీసులు అప్రమత్తమై నిందితుడిని గుర్తించారు. ఏప్రిల్‌లో నాచారంలో అడుగుపెట్టిన సత్యేంద్ర సింగ్‌ ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ వాహనం కూడా దొంగిలించాడు. 


ఇతణ్ని పీటీ వారెంట్‌పై తీసుకువచ్చిన బంజారాహిల్స్‌ పోలీసులు కోర్టు అనుమతితో మూడు రోజుల కస్టడీకి తీసుకున్నారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు విచారించనున్నారు. చోరీ అయిన కార్లను రికవరీ చేయనున్నారు. షెకావత్‌ చోరీ చేసిన కార్లను విక్రయించి సొమ్ము చేసుకుంటాడని, ఆ సొమ్ముతో జల్సాలు చేస్తాడని పోలీసులు గుర్తించారు.