పెళ్లయ్యి పిల్లలున్నా వేరే యువతులతో నెరపుతున్న అక్రమ సంబంధాలు చివరకు ప్రాణాలమీదకు తెస్తున్నాయి.. పెళ్లయ్యిందని తెలిసినా వివాహేతర సంబంధం పెట్టుకుని సర్వం పోగొట్టుకుని పగతో రగిలిపోతున్నారు కొందరు యువతులు.. సోషల్‌ మీడియా వేదికగా పరిచయాలు, లేదా అనుకోకుండా వచ్చిన ఫోన్లు ఇలా ఎలాగోలా పరిచయాలు పెంచుకుని అక్రమ సంబంధాలు నెరపి చివరకు కక్షలతో రగిలిపోతూ వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.. వారిని నమ్ముకున్న వారిని అంధకారంలోకి నెడుతున్నారు.. సరిగ్గా ఇటువంటి ఘటనే తూర్పుగోదావరి జిల్లాలోని గోకవరంలో చోటుచేసుకుంది.. ఇంటి డాబాపై నిద్రిస్తుండగా ఓ యువతి, యువకుడు కలిసి వచ్చి వెంట తెచ్చుకున్న కర్రతో దాడిచేసి ఆపై కత్తిపీటతో శరీరంపై తీవ్ర గాయాలు చేసి పీక కోశారు. వెంటనే అక్కడినుంచి పరారయ్యారు.. హతుని హాహాకారాలు విన్న తల్లి, ఇరుగుపొరుగువారు 108లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. 


తాపీ పనిచేసుకుంటూ పరిచయం 


గోకవరం గ్రామానికి చెందిన ఒమ్మి నాగశేషు(25) తాపీ పని చేసుకుంటూ ఉపాధి పొందుతున్నాడు. ఇతనికి ఏడాది క్రితం కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలుకు చెందిన అరుణతో వివాహం అయ్యింది. ఈ క్రమంలోనే తాపీ పని చేసుకునే క్రమంలోనే అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంకు చెందిన కుర్లు డిబేరా అనే యువతితో పరిచయం ఏర్పడిరది. హతుడు నాగశేషు, డిబేరాల మధ్య మధ్య గత ఏడేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. అదికాస్త వివాహేతర సంబధానికి దారితీయగా డిబేరా నాగశేషుకు రూ.2 లక్షల నగదు, బంగారు గొలుసు ఇచ్చింది. అది ఇవ్వాలని గత కొంతకాలంగా ఆమె నాగశేషును అడుగుతున్నా ఇవ్వడం లేదని, అంతేకాకుండా వీరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్లు కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ క్రమంలోనే తన డబ్బు, గొలుసు వెంటనే ఇవ్వాలని డిబేరా డిమాండ్‌ చేసినా అతని నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో చంపాలని నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.


కర్ర, కత్తిపీట వెంట తెచ్చుకుని మరీ హత్య


హతుడు నాగశేషుపై విపరీతంగా ఆవేశంతో రగిలిపోయిన డిబేరా రాజవొమ్మంగి ప్రాంతానికి చెందిన శివన్నారాయణ అనే యువకుడితో కలిసి బుధవారం అర్ధరాత్రి తాపీమేస్త్రి అయిన ఒమ్మి నాగశేషు నిద్రిస్తున్న ఇంటి వద్దకు వచ్చిందని పోలీసులు చెప్పారు. నాగశేషు ఇంటి మేడపై నిద్రిస్తున్నాడని అప్పటికే డిబేరాకు తెలియడంతో నేరుగా పైకి ఎక్కి నిద్రిస్తున్న నాగశేషుపై డిబేరా, ఆమె వెంట వచ్చిన శివన్నారాయణ దాడి చేశారు. ఆపై వెంట తెచ్చుకున్న కత్తిపీటతో తీవ్రంగా గాయపరిచి, నాగశేషు గొంతుకోసే ప్రయత్నం చేశారు.


తీవ్రగాయాలపాలైన హతుడు పెద్దపెద్ద కేకలు వేయడంతో అక్కడి నుంచి డిబేరా, శివన్నారాయణ పారిపోయారు. దీంతో హతుని తల్లి గంగతోపాటు స్థానికులు డాబాపైకి వచ్చి చూసేసరికి తీవ్ర రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న నాగశేషును 108లో గోకవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి మరింత విషమించడంతో రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ఎస్సై నాగశివబాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నార్త్‌ జోన్‌ డీఎస్పీ కడలి వెంకటేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. అర్ధరాత్రి మృతుడి హాహాకారాలు విన్న స్థానికులు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యామని తెలిపారు.