ఏలూరు జిల్లా దెందులూరు వద్ద జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న కారు ఢీకొని వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి భీమడోలుకు చెందిన పశువైద్యాధికారి శృంగవృక్షంకు నరసయ్య అక్కడిక్కడే మృతి చెందారు. అయితే, ఢీ కొట్టిన కారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌కు చెందినదిగా గుర్తించారు. ప్రమాద ఘటన జరిగిన సమయంలో కారులో ఎంపీ భరత్‌ కూడా ఉన్నారని స్థానికంగా చూసిన వారు చెబుతున్నారని తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదానికి కారణమైన కారును, డ్రైవరును దెందులూరు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.


మృతుడు శృంగవృక్షం నరసయ్య స్కూటీపై వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మృతి చెందిన నరసయ్య మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 


భరత్‌ వేరే కారులో వెళ్లిపోయినట్లు ప్రచారం


దెందులూరు వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాద సమయంలో ఢీకొట్టిన కారులో రాజమండ్రి ఎంపీ కారులో ఉన్నారని, ఆ సమయంలో ఆయన కారులోనే ఉండి పోలీసులకు సమాచారం అందించి వేరే కారులో వెళ్లిపోయారని ప్రచారం జరుగుతోంది. అసలు ఆ సమయంలో భరత్‌ కారులో లేరని కొంతమంది చెబుతున్నారు. ఎంపీ భరత్‌ వాడుతున్న కారు బ్లాక్‌ కలర్‌ కియా కాగా, ఆ కారు ప్రస్తుతం దెందులూరు పోలీస్‌ స్టేషన్‌లో ఉంచారు. ఇదిలా ఉంటే మృతుడు భీమడోలులో పశు వైద్యుడిగా పనిచేస్తున్నారని, ఆయన మృతితో కుటుంబం ఆధారం కోల్పోయిందని తెలుస్తోంది.