Andhra BJP : ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ కావలి పర్యటనలో నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన బీజేపీ నాయకుల విషయంలో పోలీసుల వ్యవహిరంచిన తీరు చర్చనీయాంశమవుతోంది. ఓ బీజేపీ నాయకుడి తలను కాళ్ల మధ్యలో పెట్టుకున్న పోలీసు అధికారి తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దీనిపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నరు.
నెల్లూరు జిల్లాలో కావలిలో బీజేపీ నేతల నిరసన
చుక్కల భూములకు విముక్తి సభలో పాల్గొనేందుకు సీఎం జగన్ కావలి వచ్చారు. ఈ సభకు వెళ్లే సమయంలో బీజేపీ కార్యకర్తలు ప్రజా సమస్యల విషయంలో నిరసన చేపట్టారు. కాన్వాయ్ ను అడ్డుకుంటారన్న ఉద్దేశంతో పోలీసులు వందల సంఖ్యలో గుమికూడారు. బీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారు. ఈ ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. బీజేపీ పార్టీ కార్యకర్తల పట్ల పోలీసులు తీవ్రంగా వ్యవహరించారు. అప్రజాస్వామికంగా వ్యవహరించి పోలీసు వ్యవస్థపై ప్రజలకు ఉండే నమ్మకాన్ని , మీ నుండి ప్రజలు పొందాల్సిన భరోసాను సమాజానికి దూరం చేసేలా వ్యవహిరంచారన్న ఆరోపణలు చేశారు.
తీవ్రంగా ఖండించిన నేతలు
ప్రజాస్వామ్య విలువలను పోలీసు బూట్లు తొక్కేస్తున్నాయని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. అన్యాయాన్ని ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు. సీఎం జగన్ కావలి పర్యటన నేపథ్యంలో నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన బీజేపీ నేతల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య నిరసనలను అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు జీవో నెం.1ని కొట్టివేసి క్షణాలు గడవకముందే ఏపీ పోలీసులు అరాచకానికి పాల్పడ్డారని మండిపడ్డారు. ముఖ్యమంత్రికి ప్రజాసామ్యయుతంగా నిరసన తెలపడం కూడా తప్పేనా? అని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారని పదుల సంఖ్యలో పోలీసులు బీజేపీ నేతలపై దాడి చేస్తారా? కాళ్లతో తొక్కి హేయంగా ప్రవర్తిస్తారా? అని నిలదీశారు.