Harsha Kumar Son Case : మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ కుమారుడు శ్రీరాజ్ పై తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. సెక్షన్ 35 డి, 504 ఐపీసీ సెక్షన్లు కింద కేసు నమోదు చేశారు పోలీసులు. రాజమండ్రి మంజీరా హోటల్ నుంచి స్నేహితులతో కలిసి తన కారులో ఫామ్ హౌస్ కు వెళ్తున్న క్రమంలో తనతో శ్రీరాజ్ అసభ్యంగా ప్రవర్తించారని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతిని తాకి అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు బలవంతంగా ముద్దుపెట్టుకునేందుకు ప్రయత్నించాడని అభియోగం చేసింది. ఈ సంఘటనపై మంగళవారం ఉదయం నుంచి కోరుకొండ పోలీస్ స్టేషన్ వద్ద హైడ్రామా నడిచినట్లు సమాచారం. అయితే ఈ సంఘటనపై పోలీసులను వివరణ కోరేందుకు ప్రయత్నించగా వారి నుంచి సాయంత్రం వరకు ఎటువంటి సమాచారం రాలేదు. 


శ్రీరాజ్ పై  కేను నమోదు  


మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ తనయుడు శ్రీరాజ్ పై బాధితురాలు ఫిర్యాదు మేరకు కోరుకొండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు నార్త్ జోన్ డీఎస్పీ కడలి వెంకటేశ్వరరావు వెల్లడించారు. శ్రీరాజ్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ పవన్ కుమార్ రెడ్డి తెలిపారు. 


దళితుడిననే టార్గెట్ 


మాజీ ఎంపీ హర్ష కుమార్ తనయుడు శ్రీరాజ్ ఈ సంఘటనపై వివరణ ఇచ్చారు.  భారత్ దేశంలో ఏ స్త్రీ అయినా సరే మోకాలు పైకి దుస్తులు ధరంచి కనబడితే తాను మందలిస్తానని, దానికే 100 కి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వడం బాధాకరం అన్నారు. కనీసం పోలీసులు ఈ కేసు విషయంలో ఒక్క నోటీసు కుడా ఇవ్వలేదన్నారు. కానీ ఇంతలోనే అన్ని టీవీ ఛానెల్స్ లో తనపై బ్రేకింగ్ రావడం చాలా దురదృష్టకరమన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని, కేవలం తాను దళితుడిని ఏమీ చెయ్యలేననే  ఇటువంటి కుట్ర జరిగిందన్నారు. ఈ తప్పుడు కేసును యువతి విత్ డ్రా చేసుకుందని శ్రీరాజ్ తెలిపారు. కేసు విత్ డ్రా చేసుకున్నట్లు పోలీసుల ఎలాంటి ప్రకటన చేయాలేదు.  


హర్ష కుమార్ ఎలా స్పందిస్తారో? 


 వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌ భాస్కర్‌ బాబు మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం మృతి వ్యవహారంపై హైకోర్టు కలగజేసుకుని సీబీఐ విచారణకు ఆదేశించాలని మాజీ ఎంపీ హర్షకుమార్‌ ఇప్పటికే చాలాసార్లు డిమాండ్ చేశారు. సీఎం జగన్‌, మంత్రి వేణుగోపాలకృష్ణ, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి ఎమ్మెల్సీ అనంతబాబు బినామీ అప్పట్లో హర్షకుమార్ ఆరోపించారు.  ఏజెన్సీలో గంజాయి నుంచి గనుల వరకు అక్రమాలన్నీ అనంతబాబు కనుసన్నల్లోనే జరుగుతుంటాయని ఆరోపించారు. గెస్ట్‌హౌస్‌లు, ఇతర రహస్య ప్రదేశాలు డ్రైవర్‌ సుబ్రహ్మణ్యానికి తెలుసన్నారు. దీనికి సంబంధించిన విషయాలు అక్కడక్కడా మాట్లాడుతున్నాడనే సుబ్రహ్మణ్యాన్ని చంపేశారని హర్షకుమార్‌ అప్పట్లో ఆరోపించారు. ఒక ఎమ్మెల్సీ తీసుకెళ్లి చంపేసి తీసుకొచ్చాడని అతడికి ఏ స్థాయిలో మద్దతు లేకపోతే ఇలా చేస్తాడన్నారు. అయితే ఎమ్మెల్సీ విషయంలో తీవ్రంగా స్పందించిన హర్ష కుమార్ తన కుమారుడిపై కేసుపై ఎలా స్పందిస్తారో చూడాలి. వైసీపీ ప్రభుత్వంపై వీలు దొరికినప్పుడల్లా విమర్శలు చేస్తున్నారు హర్షకుమార్.