Meghalaya Missing Couple Case: హనీమూన్ కోసం వెళ్లిన ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ, ఆయన భార్య మిస్సింగ్ కేసు మిస్టరీ వీడింది. భార్యనే ప్రధాన నిందితురాలు అని మేఘాలయ డీజీపీ తెలిపారు. జంట అదృశ్యం కాగా, కొన్ని రోజులకు రాజా రఘువంశీ డెడ్ బాడీని గుర్తించారు. ఆయన భార్య ఏమైంది అని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. హనీమూన్‌కు వెళ్లిన తరువాత కాంట్రాక్ట్ కిల్లర్లకు సుపారీ ఇచ్చి మరీ నిందితురాలు తన భర్త రాజా రఘువంశీని హత్య చేపించిందని మేఘాలయ పోలీసులు తెలిపారు. ఈ కేసులో మృతుడి భార్య సోనమ్‌తో పాటు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. సుపారీ ఇచ్చి భర్తను సోనమే చంపించిందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలడం దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది.
డీజీపీ ఐ నొంగ్రాంగ్ మాట్లాడుతూ, "ఒక నిందితుడిని ఉత్తరప్రదేశ్‌లో అదుపులోకి తీసుకున్నాం, మరో ఇద్దరిని ఎస్‌ఐటీ ఇండోర్‌లో అరెస్ట్ చేసింది. ప్రధాన నిందితురాలు సోనమ్ ఉత్తరప్రదేశ్‌లోని నంద్‌గంజ్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది. ఆమెను పోలీసులు అరెస్టు చేశారు" అని ఆయన తెలిపారు.
టూర్ గైడ్ ఈ సమాచారం ఇచ్చాడు
ఇండోర్‌కు చెందిన హనీమూన్ జంట రాజా రఘువంశీ, అతని భార్య సోనమ్ హనీమూన్‌కు వెళ్లారు. మేఘాలయలోని సోహ్రా ప్రాంతంలో వీరు అదృశ్యమయ్యారని పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ వారితో పాటు మరో ముగ్గురు వ్యక్తులు కూడా ఉన్నారని ఒక టూర్ గైడ్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అతడిచ్చిన సమాచారంతో పోలీసులు కేసును ఛేదించారని ఒక అధికారి ధృవీకరించారు.
మేఘాలయ ముఖ్యమంత్రి సైతం ట్వీట్
ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ హత్య కేసును మేఘాలయ పోలీసులు ఛేదించారని మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ కె. సంగ్మా ట్వీట్ చేశారు. ఈ కేసులో మధ్యప్రదేశ్, యూపీ నుంచి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో ప్రధాన నిందితురాలైన మృతుడి భార్య సోనమ్ పీఎస్ లో లొంగిపోయింది. మరొక దాడి చేసిన వ్యక్తిని పట్టుకునే ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది అని రాసుకొచ్చారు.
మొత్తం కేసు గురించి తెలుసుకోండి
ఇండోర్‌కు చెందిన ఈ జంట మే 11, 2025న వివాహం తర్వాత హనీమూన్ కోసం మేఘాలయాలోని షిల్లాంగ్‌కు వెళ్లారు. మే 20న మేఘాలయ చేరుకున్నారు. మే 23న కుటుంబ సభ్యులతో వారు చివరిసారిగా మాట్లాడారు. ఆ తర్వాత ఇద్దరి ఫోన్‌లు స్విచ్ఛాఫ్ అయ్యాయి.
జంట అద్దెకు తీసుకున్న స్కూటీ సోహ్రారిమ్ ప్రాంతంలో వారు కనిపించకుండా పోయారు. తరువాత, జూన్ 2న, వే సోడాంగ్ జలపాతం సమీపంలో ఒక లోయలో రాజా రఘువంశీ మృతదేహం కుళ్లిన స్థితిలో కనిపించింది. పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. మరోవైపు భార్య సోనమ్ ఆచూకీ తెలియరాలేదు, దీనితో కుటుంబ సభ్యులు కిడ్నాప్ లేదా మనుషుల అక్రమ రవాణా జరిగి ఉంటుందని అనుమానించారు.
ఇండోర్‌కు చెందిన రవాణా వ్యాపారి రాజా రఘువంశీ మే 11న సోనమ్ రఘువంశీని వివాహం చేసుకున్నారు. రాజా మృతదేహం లభించినప్పటి (జూన్ 2) నుంచి పోలీసులు సోనమ్ ఆచూకీ కోసం వెతుకుతున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న సమయంలో సోనమ్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది. ఈ జంటకు ఏమి జరిగింది, రాజా ఎలా మరణించాడో పూర్తి వివరాలపై దర్యాప్తు కొనసాగుతోంది.