Crime News: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో దారుణం జరిగింది. ఆరు నెలల కడుపుతో ఉన్న భార్యని భర్త మంచానికి కట్టేసి నిప్పంటించి హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇప్పటికే ఆ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం సుఖ్‌దేవ్ సింగ్ తన భార్యతో గొడవ పడ్డాడు. ఆ ఆవేశంలోనే ఆమెని మంచంపై కదలకుండా కట్టేశాడు. ఆ తరవాత నిప్పు అంటించాడు. మరో మూడు నెలల్లో ఆమె కవలలకు జన్మనివ్వాల్సి ఉండగా ఇంతలోనే ఇలా హత్యకు గురైంది. భార్యాభర్తలు తరచూ గొడవ పడే వారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఇద్దరికీ మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. అప్పటి నుంచి ఏదో ఓ గొడవ జరుగుతూనే ఉండేది. ఈ నెల 19వ తేదీన కూడా ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. ఆ సమయంలోనే ఈ దారుణానికి ఒడిగట్టాడు సుఖ్‌దేవ్. వెంటనే నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది. ఈ ఘటనపై మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేసింది. మూడు రోజుల్లోగా దీనిపై ఓ రిపోర్ట్ సమర్పించాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు X వేదికగా ఓ పోస్ట్ పెట్టింది.
"అమృత్‌సర్‌లో జరిగిన ఘటన ఆందోళనకు గురి చేసింది. ఇది చాలా దారుణమైన ఘటన. మంచానికి కట్టేసి నిప్పంటించాడని తెలిసి దిగ్భ్రాంతి చెందాం. ఇది ఊహకు కూడా అందని దారుణం. ఇప్పటికే పంజాబ్ డీజీపీ లేఖ రాశాం. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాం"
- మహిళా కమిషన్