Phone Tapping Case Investigation: రాష్ట్రంలోనే సంచలనం కలిగించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో (Phone Tapping) పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో లోతుగా వెళ్లే కొద్దీ సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి (Cm Revanth Reddy) ఇంటికి సమీపంలోని ఓ గెస్ట్ హౌస్ లో సోమవారం ఉదయం పోలీసులు సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇది ఓ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ నవీన్ రావుది అని ప్రచారం సాగుతోంది. ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ కోసం ఈ గెస్ట్ హౌస్ నే ప్రణీత్ రావు బృందం డెన్ గా మార్చుకుని ఉంటుందని దర్యాప్తు బృందం భావిస్తోందని సమాచారం. సీఎం రేవంత్ ఇంటికి కూతవేటు దూరంలో ఉండడంతోనే తమ పని అక్కడి నుంచే సులువు అవుతుందని ఆ టీం భావించినట్లు చెబుతున్నారు.
'గెస్ట్ హౌస్ పదిలమని.!'
ఈ గెస్ట్ హౌస్ నుంచే అడిషనల్ ఎస్పీ భుజంగరావు ట్యాపింగ్ ఆపరేషన్ నిర్వహించినట్లు సమాచారం. నిందితులు విచారణలో వెల్లడించిన సమాచారం మేరకే పోలీసులు ఇప్పుడు గెస్ట్ హౌస్ లో సోదాలు నిర్వహించారు. ఫోన్ ట్యాపింగ్ ఆపరేషన్ కు పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఆఫీస్ కంటే ఈ గెస్ట్ హౌస్ మేలని.. ఇక్కడే మీటింగ్ పెట్టి తతంగం అంతా నడిపినట్లు దర్యాప్తులో నిందితులు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి త్వరలో ఆ ఎమ్మెల్సీని దర్యాప్తు బృందం పిలిచి విచారించనున్నట్లు సమాచారం. అటు, ఈ వ్యవహారం నల్గొండ జిల్లాలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. జిల్లాకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లను సైతం ఈ కేసులో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా డబ్బు పంపిణీతో పాటు వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేశారనే ఆరోపణలున్నాయి. దీనిపైనా దర్యాప్తు బృందం విచారిస్తోంది.
'ఆ ప్రచారం అవాస్తవం'
అయితే, తనకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్సీ నవీన్ కుమార్ స్పష్టం చేశారు. 'ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నా గురించి గత కొన్ని రోజులుగా మీడియా, సోషల్ మీడియాల్లో జరుగుతున్న ప్రచారం అవాస్తవం. ఆ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నాపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారు. నా గెస్ట్ హౌస్ లో ఎలాంటి తనిఖీలు జరగలేదు. సోషల్ మీడియాలో వస్తున్నది తప్పు. కుట్ర పూరితంగా నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి ప్రచారం చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. పోలీసులకు కూడా ఫిర్యాదు చేయనున్నాం.' అని నవీన్ రావు పేర్కొన్నారు.
టెక్నాలజీ అదేనా!
అయితే, ఫోన్ ట్యాపింగ్ కు వినియోగించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని హైదరాబాద్ నుంచే సమకూర్చుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మాదాపూర్ లోని ఓ ఇన్నోవేషన్ ల్యాబ్ ఇందుకు సంబంధించి టెక్నలాజికల్ టూల్ ను అందించే కన్సల్టెన్సీగా వ్యవహరించినట్లు తేలింది. టెలీ కమ్యూనికేషన్ రంగంలో అపార అనుభవం ఉన్న ఆ కంపెనీ ద్వారానే సాఫ్ట్ వేర్ ను సమకూర్చుకున్న ప్రణీత్ బృందం.. దీన్ని అక్రమ వ్యవహారాలకు వినియోగించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఎస్ఐబీలోనే రెండు ప్రత్యేక గదులు ట్యాపింగ్ వ్యవహారానికి కేంద్రంగా ఉన్నాయని.. బయటి ప్రాంతాల్లో సర్వర్లు పెట్టి నిఘా ఉంచలేదని ఇప్పటివరకూ జరిగిన దర్యాప్తులో తేలింది.
అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే ఫోన్ ట్యాపింగ్ నిలిపేసినట్లు దర్యాప్తులో తేలింది. ఎస్ఐబీలో 17 కంప్యూటర్లలోని 42 హార్డ్ డిస్క్ లను తీసేసి.. వాటి స్థానంలో కొత్త వాటిని అమర్చారని తెలుస్తోంది. ఈ కారణంగా మావోయిస్టులకు సంబంధించిన సమాచారం కూడా లేకుండా పోయిందని సమాచారం. పోలీస్ విచారణలో ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారం ఆధారంగానే మూసీ నదిలో నాలుగో బ్రిడ్జి కింద హార్డ్ డిస్క్ శకలాలను స్వాధీనం చేసుకున్నారు.
ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక బృందం ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో మొదట మాజీ పోలీస్ అధికారి ప్రణీత్ రావు ను అరెస్ట్ చేసింది. విచారణలో ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్లతో పాటు ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలున్నాయి. ముఖ్యంగా నేతల ఫోన్లు ట్యాప్ చేసి వారి ఎన్నికల సంబంధిత, వ్యక్తిగత విషయాలపై నిఘా పెట్టారని అభియోగాలున్నాయి. తెలంగాణలో ప్రభుత్వం మారిన సమయంలో ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ ఆడియో రికార్డు చేసిన హార్డ్ డిస్క్ లను ధ్వంసం చేశారని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మార్చి 28న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
Also Read: Kavitha: ఎమ్మెల్సీ కవితకు దక్కని ఊరట - మధ్యంతర బెయిల్ నిరాకరించిన కోర్టు