Prakasam Crime : చిన్న చిన్న కారణాలతో నిండు జీవితాలను కడతేర్చుకుంటున్నారు కొందరు వ్యక్తులు. భర్త సినిమాకు తీసుకెళ్లలేదని మహిళ ఆత్మహత్య, భార్యకు బట్టలు ఉతకడం రాదని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఇటీవల చోటుచేసుకున్నాయి. అయితే ప్రకాశం జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. అయితే ఇది ఆత్మహత్య కాదు హత్య.
అసలేం జరిగింది?
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మార్కాపురం పరిధిలోని జమునపల్లె చెంచు కాలనీలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో భర్తే నిందితుడు. మార్కాపురం గ్రామీణ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చెంచుకాలనీకి చెందిన దాసరి చిన్న అంకాలు భార్య బసవమ్మ(35) బుధవారం రాత్రి గొడవపడ్డారు. మద్యం మత్తులో ఇంటికి వచ్చిన అంకాలు బసవమ్మకు తనకు భోజనం పెట్టలేదన్న కారణంతో ఆమెపై కర్రతో దాడి చేశాడు. ఆ దాడిలో కర్ర బసవమ్మ గుండెల్లో గుచ్చుకుంది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. స్థానికులు ఘటనను గమనించి ఆమెను ఆసుపత్రికి తరలించేలోపు మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నాగర్ కర్నూల్ లో దారుణం
నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు గ్రామంలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఓంకార్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన మహేశ్వరిని మూడో పెళ్లి చేసుకున్నాడు. ఓంకార్, మహేశ్వరికి ఇద్దరు పిల్లలు పుట్టారు. బుధవారం రోజు నాగర్ కర్నూల్‌లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయిస్తానని చెప్పి భార్య, పిల్లలను ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లాడు. మార్గ మధ్యంలోనే దంపతులకు గొడవ జరిగింది. భార్యని చంపేస్తానని ఓంకార్ బెదిరించడంతో.. మహేశ్వరి బండి పైనుంచి దూకేసింది. అయితే ఆవేశంలో ఉన్న ఓంకార్ బండి ఆపకుండానే వెళ్లిపోయాడు.
పిల్లల గొంతు కోసి
కోడేరు మండలం ఎత్తం గ్రామ శివారులోని గుట్ట వద్దకు వెళ్లాడు. ద్విచక్ర వాహనాన్ని సమీపంలోని పొలం వద్ద వదిలేసి పిల్లలను గుట్టపైకి తీసుకుపోయాడు. వెంట తెచ్చుకున్న కత్తితో పిల్లల గొంతు కోసి హత్య చేశాడు. ఆపై పిల్లలను అక్కడే వదిలేసి గుట్ట దిగుతూ.. తానూ గొంతు కోసుకున్నాడు. అలాగే నడుచుకుంటూ వచ్చి రోడ్డుపై పడిపోయాడు. బండి పైనుంచి దూకిన మహేశ్వరి పెద్ద కొత్తపల్లి ఠాణాలో పోలీసులను ఆశ్రయించింది. తన భర్త ఇద్దరు పిల్లలను చంపేస్తానని తీసుకెళ్లాడని వివరించింది. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఓంకార్ చరవాణి లొకేషన్ ఆధారంగా వాళ్లు ఎక్కడున్నది తెలుసుకున్నారు. అక్కడికి మహేశ్వరితో సహా వెళ్లగా.. రోడ్డుపై భర్త రక్తపు మడుగులో కనిపించాడు. అతడిని నాగర్ కర్నూల్ ఆస్పత్రికి అక్కడి నుంచి మహబూబ్ నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Also Read : Vizag Murders: మరోసారి ఉలిక్కిపడ్డ విశాఖ, నడ్డిరోడ్డుపై రౌడీషీటర్ హత్య!
Also Read : రెచ్చిపోతున్న రౌడీ మూకలు- దాడులు, దౌర్జన్యాలతో సిక్కోలు ప్రజలు బెంబేలు