Popular Karnataka astrologer affair : కర్ణాటకలో టీవీ కార్యక్రమాలు, సెలబ్రిటీలతో పరిచయాలతో ఒక వెలుగు వెలిగిన ఆ జ్యోతిష్యుడి పేరు రాష్ట్రవ్యాప్తంగా సుపరిచితం. ఇతరుల భవిష్యత్తును అంచనా వేస్తూ, పరిహారాలు చెప్పే ఆయన జీవితంలో ఒక  చీకటి కోణం ఉంది. ఒక మహిళతో సాగిస్తున్న వివాహేతర సంబంధం ఆయనను మతం, మంత్రం నుంచి నేరం వైపు మళ్లించింది. ఈ క్రమంలో ఆ మహిళా బంధువు ఒకరు అడ్డురావడంతో, తన జాతకంలో గండం పొంచి ఉందని తెలియక.. అహంకారంతో ఆ అడ్డంకిని తొలగించుకోవాలని జ్యోతిష్యుడు మాస్టర్ ప్లాన్ వేశాడు. కర్ణాటకలోని  ఉత్తర కన్నడ జిల్లా సిద్ధాపుర ప్రాంతానికి చెందిన  వసంత్ నాయక్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో టీవీ ఛానల్స్‌లో ప్రముఖ జ్యోతిష్యుడిగా వెలుగొందుతున్న కమలాకర్ భట్ అలియాస్ గురూజీ  ప్రధాన నిందితుడిగా తేలాడు. కమలాకర్ భట్ శివమొగ్గ కేంద్రంగా జ్యోతిష్య కార్యకలాపాలు నిర్వహిస్తూ, రాజకీయ నాయకులు , సెలబ్రిటీలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడు. అయితే, తన వద్దకు జాతకం కోసం వచ్చిన సుచిత్ర అనే వివాహితతో అతనికి ఏర్పడిన అక్రమ సంబంధం ఈ ఘోరానికి దారితీసింది.

Continues below advertisement

సుచిత్ర తన భర్త  మహేష్ నాయక్,  ఇద్దరు పిల్లలను వదిలేసి, శివమొగ్గలో జ్యోతిష్యుడు కమలాకర్ భట్‌తో కలిసి ఉంటోంది. అయితే, సుచిత్ర పెద్ద కుమార్తె తన తల్లి ప్రవర్తనపై విసుగు చెంది, బెంగళూరులో ఉంటున్న తండ్రి మహేష్‌కు సమాచారం అందించింది. దీంతో మహేష్ తన కుమార్తెను సిద్ధాపురలోని తన సొంత గ్రామం  అవరగుప్ప కు తీసుకువచ్చి, సిద్ధాపుర పోలీస్ స్టేషన్‌లో సుచిత్రపై ఫిర్యాదు చేశాడు. తన కుమార్తెను తన నుంచి దూరం చేశాడన్న కోపంతో, జ్యోతిష్యుడు కమలాకర్ భట్, సుచిత్ర , ఆమె తండ్రి  లోకనాథ్ మరో నలుగురు అనుచరులతో కలిసి సోమవారం రాత్రి మహేష్ ఇంటిపై దాడికి దిగారు.

నిందితులు కత్తులు, మారణాయుధాలతో మహేష్‌పై దాడి చేస్తుండగా, అతని సోదరుడు  వసంత్ నాయక్ అడ్డువచ్చాడు. ఈ క్రమంలో నిందితులు వసంత్ నాయక్‌ను అత్యంత కిరాతకంగా పొడిచి చంపారు. ఈ ఘర్షణలో మహేష్ ,అతని స్నేహితుడు కుమార్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన వెంటనే జ్యోతిష్యుడి ముఠా అక్కడి నుంచి పరారైంది. అయితే, వసంత్ నాయక్ భార్య  సంధ్య  ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, సాంకేతిక ఆధారాల సాయంతో గాలింపు చేపట్టి  కమలాకర్ భట్, సుచిత్ర, లోకనాథ్, ఆకాష్‌ తో పాటు మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశారు.

Continues below advertisement

ప్రస్తుతం ఈ హత్యోదంతం కర్ణాటక రాజకీయ,  ఆధ్యాత్మిక వర్గాల్లో పెను దుమారం రేపుతోంది. జాతకాలు చెప్పే గురూజీలు ఇలాంటి నేరాలకు పాల్పడటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులకు కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేస్తూ వసంత్ కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. జ్యోతిష్యుడి ముసుగులో సాగిన ఈ  రక్త చరిత్ర ఇప్పుడు చట్టం ముందు బోనులో నిలబడింది.