Ganza Seized In A Tanker In Asifabad: మీకు పుష్ప సినిమా గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో ట్యాంకర్ల మాటున ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తుంటారు. సరిగ్గా అలాంటి ప్లాన్‌తోనే కొందరు గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడ్డారు. అనుమానంతో పోలీసులు చెక్ చేయగా.. అసలు విషయం వెలుగు చూసింది. దీన్ని చూసిన పోలీసులు షాకయ్యారు. ఈ ఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో (Asifabad District) గురువారం చోటు చేసుకుంది. అయితే, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా గంజాయి, మాదక ద్రవ్యాల రవాణా మాత్రం ఆగడం లేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వాంకిడి చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఓ ట్యాంకర్ వచ్చి ఆగింది. అనుమానం వచ్చిన పోలీసులు ట్యాంకర్‌ను పక్కన ఉంచి తనిఖీలు చేపట్టగా అందులో గంజాయి లభించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అంతరాష్ట్ర సరిహద్దు అయిన వాంకిడి వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు.


రూ.72.50 లక్షల గంజాయి


వాంకిడి చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆసిఫాబాద్ వైపు నుంచి మహారాష్ట్రకు వెళ్తున్న ట్యాంకర్ అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో పోలీసులు తనిఖీ చేయగా.. భారీగా గంజాయి లభ్యమైంది. ట్యాంకర్ మధ్య భాగంలో ప్రత్యేకంగా తయారు చేసిన అరల్లో గంజాయిని గుర్తించారు. డ్రైవర్ బల్వీర్‌సింగ్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాడిగా గుర్తించారు. మహారాష్ట్రకు చెందిన అరబింద్ అనే వ్యక్తి డ్రైవర్‌ను గంజాయి సరఫరా కోసం రాజమండ్రికి పంపాడని, గంజాయిని అక్కడ లోడ్ చేసుకుని తిరిగి వస్తున్న క్రమంలో వాంకిడిలో దొరికిపోయినట్లు పోలీసులు తెలిపారు.


ఇందులో మొత్తం 145 గంజాయి ప్యాకెట్స్, ఒక్కొక్కటి సుమారు 2 కేజీల చొప్పున, మొత్తం 290 కిలోల బరువు ఉందని, దీని విలువ సుమారుగా రూ.72.50 లక్షలు ఉంటుందన్నారు. ట్యాంకర్‌తో పాటు నిందితుని వద్ద నుంచి ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ట్యాంకర్ డ్రైవర్‌ను అరెస్ట్ చేశామని.. గంజాయి సరఫరాలో ముఖ్య నిందితుడు అయిన అరబింద్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందంను మధ్యప్రదేశ్‌కు పంపినట్లు ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డి.వి.శ్రీనివాసరావు తెలిపారు. 


Also Read: Crime News: తెలంగాణలో దారుణం - బాలికపై నలుగురు మైనర్ల సామూహిక అత్యాచారం