Police solved murder case of a woman in Adilabad:   ఆదిలాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన ఒంటరి మహిళ అదృశ్యం కేసును జిల్లా పోలీసులు ఛేదించారు. అది కేవలం మిస్సింగ్ కేసు మాత్రమే కాదని, పక్కా పథకం ప్రకారం జరిగిన దారుణ హత్య అని తేల్చారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో జరిగిన ఈ హత్యలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.            

Continues below advertisement

నవంబర్‌లో కనిపించకుండా పోయిన మహిళ                

పోలీసుల కథనం ప్రకారం.. ఆదిలాబాద్ కేంద్రంలోని పిట్టలవాడకు చెందిన ఇమ్రానా జబీన్ (39) నవంబర్ 26, 2025 నుంచి కనిపించకుండా పోయింది. ఈ మేరకు ఆమె సోదరి ఫిర్యాదుతో మావల పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే, లోతుగా విచారణ జరిపిన పోలీసులకు ఇంద్రవెల్లికి చెందిన మొహమ్మద్ ఫారూక్  అనే వ్యక్తితో మృతురాలికి ఆర్థిక వివాదాలు ఉన్నట్లు తెలిసింది. ఫారూక్ ఆమె వద్ద నుండి రూ. 8.8 లక్షల నగదు తీసుకోవడంతో పాటు 8.5 తులాల బంగారాన్ని కూడా తన వద్ద ఉంచుకున్నాడు. తన సొంత అవసరాల కోసం ఆ డబ్బును, బంగారాన్ని తిరిగి ఇవ్వాలని ఇమ్రానా గట్టిగా నిలదీయడంతో, ఆమెను అడ్డు తొలగించుకోవాలని ఫారూక్ తన డ్రైవర్  బస్సీ రమేష్  తో కలిసి పథకం వేశాడు.                 

Continues below advertisement

దర్యాప్తులో  అప్పు తీసుకున్న వ్యక్తే చంపినట్లు గుర్తించిన పోలీసులు                  

నిందితులు నవంబర్ 26న పథకం ప్రకారం ఇమ్రానా ఇంటికి వెళ్లి, డ్రైవర్ రమేష్ ఆమె కాళ్లు పట్టుకోగా, ఫారూక్ ఆమెను ఊపిరాడకుండా చేసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని అద్దెకు తీసుకున్న ఎర్టిగా కారులో మహారాష్ట్రలోని సర్కాని ఘాట్ అటవీ ప్రాంతానికి తరలించి, రోడ్డు కల్వర్ట్ సమీపంలోని గుంతలో పూడ్చిపెట్టారు. పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితులను జనవరి 14న దస్నాపూర్ కూరగాయల మార్కెట్ వద్ద అదుపులోకి తీసుకోగా, వారు తమ నేరాన్ని అంగీకరించారు. నిందితులు చూపిన సమాచారంతో రెవెన్యూ అధికారుల సమక్షంలో మృతదేహాన్ని వెలికి తీయగా, దుస్తుల ఆధారంగా కుటుంబ సభ్యులు ఆమెను గుర్తించారు.           

మిస్సింగ్ కేసు .. హత్య కేసుగా మార్పు                 

ఈ కేసును మిస్సింగ్ సెక్షన్ నుంచి బీఎన్‌ఎస్ సెక్షన్ 103 (హత్య) కిందికి మార్చినట్లు ఎస్పీ వెల్లడించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా పక్కా ఆధారాలను కోర్టుకు సమర్పిస్తామని స్పష్టం చేశారు. ఈ కేసును ఛేదించడంలో చురుగ్గా వ్యవహరించిన సీఐ స్వామి నేతృత్వంలోని బృందాన్ని ఎస్పీ అభినందించారు.