Nizamabad Crime News :  భర్త గల్ఫ్ వెళ్లి కష్టపడి డబ్బులు సంపాదించి ఇంటికి పంపిస్తూంటే .. ఆ డబ్బులతో జల్సా చేస్తోంది భార్య. తాను ఒక్కటే ఆ పని చేయడం లేదు. వివాహేతర బంధం పెట్టుకుని వారితో కలిసి సుఖసంతోషాలతో గడుపుతోంది. అయితే తాను కష్టపడి పంపుతున్న డబ్బులు పిల్లల భవిష్యత్ కోసం జాగ్రత్త చేస్తోందేమోలే అని.. అనుకున్న ఆ భర్తకు ఇంటికి  వచ్చినప్పుడు అసలు విషయం తెలిసింది. కానీ ఆ భార్య ఆ ఇష్యూని అక్కడితో ముగించేసింది. ఎలా అంటే..భర్తను చంపేసి. ఫ్యామిలీ స్టోరీలో  మర్డర్ స్టోరీ నిజామాబాద్‌లో జరిగింది. 


కువైట్‌లో కష్టపడి డబ్బులు పంపిన సదానంద్ 


నిజామాబాద్ జిల్లా  ఆర్మూర్ మoడలం మంథని గ్రామానికి చెందిన కవితకు సదానంద్ 2007 లో వివాహం జరిగింది. వీరిద్దరికి ముగ్గురు సంతానం.  బతుకు దేరువు కోసం భర్త సదానంద్ కువైట్ కు వెళ్లారు. కుటుంబ పోషణకు డబ్బులు పంపేవాడు. సెలవు దొరికినప్పుడు వచ్చి పోతూండేవాడు. భర్త పంపుతున్న డబ్బులతో చీకూచింత లేకుండా గడుపుతున్న కవితకు..  శేఖర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. చివరికి అది  వివాహేతర సంబంధాని దారి తీసింది. అప్పట్నుంచి భర్త సదానంద్ పంపే డబ్బులతో జల్సా చేసేది. ఈ క్రమంలో 
మే 5న సదానంద్ కువైట్ నుంచి తిరిగి వచ్చాడు. ఏదో తేడాగా ఉన్నట్లుగా గుర్తించి.. మొత్తం ఆరా తీశాడు. అసలు విషయం తెలిసిపోయింది. దీంతో సదానంద్ భార్యను డబ్బుల లెక్కలు అడిగాడు. కానీ ప్లాన్డ్‌గా  కవిత భర్తతో గొడవ పడి పుట్టింటికి వెళ్లింది.  


వివాహేతర బంధం పెట్టుకుని మరీ డబ్బుల్ని జల్సాలకు వాడిన భార్య కవిత 


మరుసటి రోజు నవిపేట్ శివారు ప్రాంతంలో భర్త సదానంద్ శవమై కనిపించాడు. దీంతో సదానంద్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదానంద్ మరణించిన చోట పురుగుల మందు డబ్బా ఉండటంతో అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడని భార్య చిత్రీకరించింది. కానీ  పోస్టు మార్టం రిపోర్టులో సదానంద్ హత్యకు గురయ్యాడని తేలింది. దీంతో పోలీసులు మృతుని భార్యను విచారించగా అసలు విషయం బైట పడింది. భర్త కువైట్ నుంచి పంపిన డబ్బులు అడిగాడని ప్రియుడి పాటు మరో ఇద్దరితో కలిసి కవిత హత్య చేసినట్లు ఒప్పుకుంది. దీంతో హత్యకు పాల్పడిన నలుగురిని అరెస్ట్ చేశారు. 


భర్తను మరో ముగ్గురితో కలిసి చంపేసి .. నోట్లో పురుగు మందు పోసిన కవిత 


పోస్టు మార్టం రిపోర్టులో సదానంద్ మెడకు స్కార్ఫ్ తో బిగించి హత్య చేసినట్లు తెలిందని పోలీసులు తెలిపారు.  ఆ పై మృతుని నోట్లో పురుగుల మందు పోసి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారని గుర్తించారు. నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. భర్త కష్టపడి పని చేసి సంపాదిస్తూంటే .. కుటుంబాన్ని నిలుపుకోవాల్సిన కవిత అడ్డదారులు తొక్కి కుటుంబాన్ని  నాశనం చేసుకుంది. ఆమె పిల్లలు ముగ్గురు ఇప్పుడు అనాథలయ్యారు.