Anantapur honeytrap case police plan: అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన  హనీట్రాప్  దందాలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. అందమైన మహిళలతో వలపు వల విసిరి, సంపన్న వర్గాలను దోచుకుంటున్న ఈ ముఠా వెనుక సాక్షాత్తూ పోలీసులే అండగా నిలవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఆర్ధికంగా స్థిరపడిన ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులే లక్ష్యంగా ఈ ముఠా సాగిస్తున్న చీకటి దందాలో చాలా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 

Continues below advertisement

ఈ దందాలో నిందితులకు సహకరించారనే బలమైన ఆరోపణలతో ఇద్దరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్లపై జిల్లా ఎస్పీ పి. జగదీష్, డీఐజీ షిమోషీ సీరియస్ అయ్యారు. అనంతపురం త్రీటౌన్ సీఐ  రాజేంద్రనాథ్  , ఫోర్ టౌన్ సీఐ  ప్రతాప్ రెడ్డి లను విధులకు దూరం చేస్  వీఆర్  కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. బాధితులు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహించడమే కాకుండా, పరోక్షంగా ముఠాకు సహకరించారనే అభియోగాలు వీరిపై ఉన్నాయి. వీరితో పాటు దాదాపు 15 మంది కానిస్టేబుళ్లు కూడా ఈ దందాలో భాగస్వాములైనట్లు సమాచారం అందడంతో శాఖాపరమైన విచారణ వేగవంతం చేశారు.

ఈ ముఠా పనితీరు అత్యంత భయంకరంగా ఉంటోంది. సోషల్ మీడియా ద్వారా పరిచయమై, ఆ తర్వాత ఏకాంతంగా కలవాలని ఆహ్వానించి బాధితులను నగ్నంగా వీడియోలు తీస్తున్నారు. ఆ వీడియోలను చూపించి లక్షలాది రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ముఠా లీడర్‌గా భావిస్తున్న రంగమ్మ అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆమె ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ ముఠాలో ఇంకా ఎంతమంది ఉన్నారు, పోలీసుల పాత్ర ఏ స్థాయిలో ఉందనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Continues below advertisement

ఇప్పటికే దాదాపు 10 మందికి పైగా బాధితులు పోలీసుల మెట్లు ఎక్కగా, పరువు పోతుందనే భయంతో మరికొందరు బయటకు రావడం లేదు. ముఠా సభ్యులు బాధితులపై ఒత్తిడి తెచ్చి ఆస్తులు కూడా రాయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. పోలీసులే రక్షకులుగా ఉండాల్సింది పోయి, ఈ బ్లాక్ మెయిల్ దందాకు అండగా నిలవడంపై  విస్మయం వ్యక్తం  అవుతోంది. ఇప్పటికే 10 మంది పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేసే యోచనలో ఉన్నారు.  

ఎస్పీ జగదీష్ నేరుగా రంగంలోకి దిగి విచారణను పర్యవేక్షిస్తున్నారు. బాధితులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, ఫిర్యాదు చేస్తే గోప్యత పాటిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. టెక్నాలజీని వాడుకుంటూ సాగిస్తున్న ఇటువంటి వలపు వల దందాలకు చరమగీతం పాడుతామని, నేరస్తులకు సహకరించే ఖాకీలను కూడా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని సమాచారం.