Turaka Kishore: ఎంత పెద్ద నేరగాడు, క్రిమినల్‌ అయినా...ఏదో ఒక చిన్న తప్పు చేస్తాడు. అది ఏంటో తెలుసుకుంటే చాలు దొంగ దొరికినట్లే...ఇదీ పోలీసుబాస్‌లు వారి కింద పనిచేసే సిబ్బందికి పదేపదే చెప్పే మాటలు. నిజంగా ఇవి అక్షరసత్యాలు. ఎన్నోరోజులు వెతికినా, వెంటాడినా దొంగలు సైతం ఓ చిన్న తప్పు చేసి దొరికిపోతుంటారు. అందుకే పోలీసులు నేరం జరిగిన ప్రాంతంలో ఏ చిన్న క్లూ కూడా మిస్సవ్వకుండా వెతుకుతుంటారు. ఇదంతా ఎందుకు చెబుతున్నాం అంటే.. ఆరు నెలలుగా తప్పించుకుని తిరుగుతున్న ఓ నేరగాడు సరిగ్గా ఇలాంటి తప్పేచేసి పోలీసులకు చిక్కాడు. చికెన్‌ షాపులో కోడిమాంసం కొనుగోలు పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.
 
తురకా కిషోర్‌ను పట్టించిన కోడికూర
పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(Pinnelli Ramakrishna Reddy), ఆయన అనుచరులు గత ఐదేళ్లలో చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. మాచర్లను అడ్డాగా  చేసుకుని  దౌర్జన్యాలు,దాడులకు పాల్పడ్డారు. మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా  అక్కడికి వచ్చిన తెలుగుదేశం సీనియర్ నేతలు బొండా ఉమ (Bonda Umamaheswararao), బుద్దా వెంకన్న(Budha Venkkanna)పై దాడి చేయడం,కారు అద్దాలు ధ్వంసం చేయడమేకాదు..ఏకంగా హత్యాయత్నానికి పాల్పడితే వారు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పిన్నెల్లి కీలక అనుచరుడు తురకా కిషోర్‌(Turaka kishore)కే  ఏకంగా ఆ తర్వాత మున్సిపల్ ఛైర్మన్ పదవి దక్కింది.
 
 
అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా పరాజయం పాలవ్వడంతోపాటు మాచర్లలోనూ  ఓటమి చెందింది.దీంతో పిన్నెల్లి సోదరులతోపాటు అనుచరులు పారిపోయారు. పోలింగ్‌రోజు అల్లర్లు, దాడులతోపాటు పాతకేసులు ఉండటంతో భయంతో వారంతా అజ్ఞాతంలోకి వెళ్లి తలదాచుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ఫోన్‌ నెంబర్లు, మకాం మార్చేస్తూ తప్పించుకుని తిరుగుతున్నారు. దాదాపు ఆరు నెలలపాటు పోలీసులు వెతికినా తురకా కిషోర్ జాడ పోలీసులు కనుగొనలేకపోయారు. అయితే తరుచూ ఫోన్‌ నెంబర్లు మారుస్తున్నా...కిషోర్‌ ఫోన్‌ పే, గూగుల్‌ పే అకౌంట్లు మాత్రం పాత ఫోన్‌ నెంబర్లతోనే  ఉన్నాయన్న విషయం పోలీసులు తెలుసుకున్నారు.  ఇదే కిషోర్ చేసిన అతిపెద్ద తప్పు. ఇంకేముంది పోలీసులు నిఘా పెట్టగా...ఒకే చికెన్‌షాప్‌కు వెళ్లి కొడిమాంసం కొనుగోలు చేస్తూ...ఫోన్ పే ద్వారా పేమెంట్‌ చెల్లిస్తున్నాడు. అలా హైదరాబాద్‌లోని మల్కాజిగిరి జైపురి కాలనీలో తురకా కిషోర్‌ ఉంటున్నట్లు తెలుసుకున్న పోలీసులు...గతేడాది డిసెంబర్‌లో దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు.
 
 
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడైన మాచర్ల మున్సిపాలిటీ మాజీ ఛైర్మన్‌ తురకా కిషోర్‌పై అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.అధికారాన్ని అడ్డుపెట్టకుని ఎమ్మెల్యేతోపాటు ఆయన అనుచరులైన తురకా కిషోర్‌,మన్నెయ్య అరాచకాలు సృష్టించారు. బెదిరింపులు,సెటిల్‌మెంట్లు చేయడం...విపక్షాలు నోరు ఎత్తకుండా దాడులు చేయడం వంటి దౌర్జన్యాలకు  పాల్పడ్డారు. గత ఐదేళ్లలో ఎక్కడాలేని విధంగా మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు పలువురు హత్యకు గురయ్యారు.ఈ  హత్యలు వెనక ఎమ్మెల్యే అనుచరుల పాత్ర ఉందనేది స్థానికంగా అందరికీ తెలిసిన విషయమే. అలాగే 2022 డిసెంబర్ 16న మాచర్లలో టీడీపీ (TDP)కార్యాలయాన్ని దహనం చేసిన కేసులో తురకా కిషోర్ ప్రధాన నిందితుడు. పాల్వాయిగేట్‌ పోలింగ్ బూత్‌లో టీడీపీ ఏజెంట్‌ నంబూరు శేషగిరిరావుపై జరిగిన దాడిలో కూడా ఆయన నిందితుడే. అలాగే పోలింగ్ ముగిసిన తర్వాతరోజు సీఐ నారాయణస్వామిపై దాడి చేసిన కేసులో కూడా తురకా కిషోర్‌పై కేసు నమోదైంది. మొత్తం ఆయనపై మూడు  హత్య కేసులు సహా ఏడు కేసులు ఉన్నాయి