Peddapalle News: నాన్నతోపాటు బండిపై షికారుకు వెళ్లడమంటే ఇష్టం లేని బుజ్జాయిలు ఎవరు ఉంటారు. అలాగే ఓ తండ్రి ఏడాదిన్నర వయసున్న బాబును బండిపైకి తీసుకోగానే కేరింతలు కొడుతూ మురిసిపోయాడు. బాగా తిప్పి చివరకు పొలంలోకి తీసుకెళ్లాడు. అప్పటి వరకు చేతులతో ఎత్తుకొని గుండెలకు హత్తుకున్న ఆ తండ్రి.. అక్కడే ఉన్న బావిలో బాబును తోసేశాడు. వెంటనే తాను కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఇలా చేసుకున్నట్లు తెలుస్తోంది. 


అసలేం జరిగిందంటే..?


పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం రాములపల్లికి చెందిన 30 ఏళ్ల కల్వల తిరుపతి రెడ్డికి మానసతో పెళ్లయింది. వీరిద్దరికీ 17 నెలల వయసున్న కుమారుడు దేవాన్ష్ కూడా ఉన్నాడు. కొన్నేళ్లుగా తిరుపతి రెడ్డికి సోదరుడు రత్నాకర్ రెడ్డికి భూ వివాదాలు ఉన్నాయి. ఈక్రమంలోనే చాలా సార్లు ఆయన బంధువులు తిరుపతిరెడ్డిని, అతడి కుమారుడిని చంపేస్తామని బెదిరించారు. దీంతో బాగా భయపడిపోయిన తిరుపతి రెడ్డి భార్యా, కుమారుడితో కలిసి ఏడాది కాలంగా సుల్తానాబాద్ లో నివాసం ఉంటున్నాడు. అయితే శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతం ఉండడంతో సొంత గ్రామానికి వచ్చారు. అమ్మా, నాన్నలను కలిసి వారితోనే పండుగను జరుపుకున్నారు. అనంతరం ఇంటికి వెళ్లిపోయారు. భార్యను అక్కడే దింపి... బాబును తీసుకొని మరోసారి గ్రామానికి బయలు దేరాడు తిరుపతి రెడ్డి. నేరుగా పొలం వద్దకు వెళ్లి చిన్నారిని బావిలో తోసేశాడు. ఆపై వెంటు తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. 


ఎంతకీ ఇంటికి రాకపోవడంతో మామకు ఫోన్ చేసిన మానస


అయితే రాములపల్లికి వెళ్లిన భర్త, కుమారుడు రాత్రి అవుతున్నా రాలేదు. భర్తకు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో భయపడిపోయిన భార్య మానస.. తన మామ సంజీవ రెడ్డికి ఫోన్ చేసింది. భర్త, కుమారుడి గురించి వాకబు చేయగా.. అక్కడకు రాలేదని అతడు చెప్పాడు. మానస అక్కడికే వచ్చారనగా.. వెంటనే ఆయన పొలం వద్దకు వెళ్లి చూశాడు. అయితే అప్పటికే తిరుపతి రెడ్డి బావి వద్ద అపస్మారక స్థితిలో కనిపించాడు. పక్కన బాబు లేకపోవడంతో భయపడిపోయిన సంజీవ రెడ్డి అంతా వెతికాడు. అయినా జాడ లేదు. దీంతో ఓసారి బావిలోకి తొంగి చూడగా.. బాలుడి చెప్పులు కనిపించాయి. వెంటనే సంజీవ రెడ్డి గ్రామస్థులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో అంతా పరుగుపరుగున పొలం వద్దకు చేరుకున్నారు.


భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు


అనంతరం పోలీసులకు విషయం చెప్పగా.. వారు కూడా హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. బావిలోంచి బాలుడిని బయటకు తీశారు. తిరుపతి రెడ్డిని మొదట సుల్తానాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రి, అక్కడి నుంచి కరీంనగర్ లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. తిరుపతి రెడ్డి భార్య మానస ఫిర్యాదు మేరకు రాత్నాకర్ రెడ్డి, అతడి మామ సత్తిరెడ్డి, బావ మరిది లక్ష్మణ్ లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.