Godavarikhani Ganja : ఉమ్మడి కరీంనగర్ (Karimnagar ) జిల్లా వ్యాప్తంగా గంజాయి రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతుండడంతో స్మగ్లర్లు(Smugglers) రూటు మార్చారు. గుట్టుచప్పుడు కాకుండా సప్లై చేయడానికి గంజాయిని లిక్విడ్(Ganja Liquid) లాగా మార్చి సీసాల్లో పోసి అమ్ముతున్నారు. స్థానిక యువకులను మత్తులో దించి స్మగ్లర్లు లక్షల విలువైన గంజాయిని తీసుకువచ్చి యువతని బానిసలుగా మారుస్తున్నారు. గోదావరిఖని(Godavarikhani)లోని ఆబ్కారీ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ రమేష్ ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.



ఇలా దొరికారు


రామగుండం(Ramgundam) విద్యుత్ నగర్ వద్ద గంజాయి ద్రావణాన్ని సరఫరా చేస్తున్నట్లు వచ్చిన సమాచారంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు చేశామని పోలీసులు తెలిపారు. ఈ దాడుల్లో ఐదుగురిని అదుపులోకి తీసుకొన్నామని వారి వద్ద 980 మిల్లి లీటర్ల  హాష్ ఆయిల్(hash oil) స్వాధీనం చేసుకున్నారు. విశాఖ అరకు(Araku) ప్రాంతం నుంచి నిందితులు 2000 మిల్లీ లీటర్ల హాష్ ఆయిల్ స్మగ్లింగ్ చేశారని దీన్ని తిరిగి చిన్న చిన్న బాటిళ్లలోకి మార్చి ఒక్కోదానికి రెండు వేల రూపాయల చొప్పున అమ్ముతున్నారని తెలిపారు. వినీత్, శశి, నరసింహాచారి, మహేష్, మరో మైనర్ ఒక గ్యాంగ్ లాగా ఏర్పడి గంజాయి స్మగ్లింగ్  చేస్తున్నారని సీఐ తెలిపారు. గోదావరి ఖనిలో తొమ్మిది లక్షల విలువైన హాష్ ఆయిల్ ను పోలీసులు పట్టుకున్నారు.   డైరెక్ట్ గా సిగరెట్ లో కలుపుకొని తాగడంతో బాటు హుక్కా లాగా దీనిని పీలుస్తారన్నారు. 


అసలేంటి ఈ హాష్ ఆయిల్???


హాష్ ఆయిల్ అనేది ఒక గాఢమైన గంజాయి(Ganja) ఫైనల్ పొడక్ట్ . ఇది లిక్విడ్ రూపంలో ఉంటుంది. దీనిని పొగబెట్టడం, ఆవిరి పట్టడం,  లేదా చర్మంపై రుద్దడం వంటి మార్గాల ద్వారా వాడతారు. హాష్ ఆయిల్ వాడకాన్ని " డబ్బింగ్ " లేదా "బర్నింగ్" అని పిలుస్తారు. హాష్ ఆయిల్ గంజాయి మొక్కల నుంచి వస్తుంది. ఇది ఇతర గంజాయి ఉత్పత్తుల మాదిరిగానే THC (డెల్టా-9-టెట్రాహైడ్రోకాన్నబినాల్) ను కలిగి ఉంటుంది. కానీ హాష్ ఆయిల్ మాములు ఆకుల రూపంలో ఉన్న దాని కన్నా మరింత శక్తివంతమైనది. ఎందుకంటే దీనిలో THC 90% వరకూ ఉంటుంది. దీనికి విరుద్ధంగా, ఇతర గంజాయి మొక్కల ఉత్పత్తులలో సగటు THC స్థాయి చాలా తక్కువ. సాధారణ గంజాయి కంటే హాష్ ఆయిల్ నాలుగు నుంచి ఐదు రెట్లు ఎక్కువ శక్తివంతమైనది. ఫలితంగా మొదటిసారి వినియోగదారులలో ఇది తీవ్రమైన, అవాంఛనీయ దుష్ప్రభావాలకు కారణమయ్యే అవకాశం ఉంది.