Peddapalli Crime News: పెద్దపల్లి జిల్లాలో దారుణం జరిగింది. ఓదెల మండలం కొమరెక్కి చెందిన ఓ వ్యక్తికి అప్పు ఇచ్చిన పాపానికి ఓ దివ్యాంగుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. కొమరెక్కి గ్రామానికి చెందిన లక్ష్మారెడ్డి దివ్యాంగుడు. అయితే అదే గ్రామానికి చెందిన ఓ రైతు అవసరం ఉందని కోరడంతో పదేళ్ల క్రితం లక్ష రూపాయలు అప్పుగా ఇచ్చాడు. ఏడాదికే ఇస్తానని చెప్పిన అతడు.. ఎంతకీ డబ్బులు తిరిగి ఇవ్వలేదు. తన డబ్బులు తనకు ఇవ్వమని ఎన్ని సార్లు వెళ్లి బతిమాలినా కనికరించలేదు. అతని చుట్టూ తిరిగి విసిగిపోయిన లక్ష్మారెడ్డి పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశాడు. అయినప్పటికీ లాభం లేకుండా పోయింది. దీంతో అతని పొలం వద్దకు వెళ్లి డబ్బులు ఇవ్వాలంటూ కోరాడు. 


ఇవ్వనని ఎన్ని సార్లు చెప్పినా మళ్లీ మళ్లీ వచ్చి అడుగుతున్నాడనే కోపంతో దివ్యాంగుడిపై విచక్షణా రహితంగా దాడికి దిగాడు. బూతులు తిడుతూ దివ్యాంగుడు లక్ష్మారెడ్డినిపై దాడి చేశాడు. కింద పడేసి మరీ కర్రలతో బాదాడు. స్థానిక రైతులు వచ్చి ఆపినా రైతు ఆపకుండా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో సదరు దివ్యాంగుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం గుర్తించిన స్థానికులు అతడిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు. అప్పు తీసుకున్న వ్యక్తి.. డబ్బులు అడిగినందుకే తనపై దాడి చేశాడని బాధితుడు పోలీసులకు తెలిపాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 


కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య..


మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ తాగేవాళ్లకు మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులకు, అయిన వాళ్లకు కూడా ఈ మద్యం ఎనలేని శోకాన్ని మిగిలుస్తుంది. రోజూ ఫుల్లుగా తాగి వచ్చి వేధిస్తుంటే.. కుటుంబ సభ్యులు నరకం చూస్తుంటారు. ఇలా నరకం అనుభవించి, అనుభవించీ తట్టుకోలేని ఓ ఇల్లాలు.. పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లిపోయింది. అది జీర్ణించుకోలేని తాగుబోతు భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఎక్కడ, ఎలా జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 


హైదరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పాపిరెడ్డి కాలనీకి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరి వేసుకొని బలవన్మరణం చేసుకున్నాడు. అయితే మృతుడు గోపాల్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గోపాల్ ఆటో డ్రైవర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు మద్యానికి బానిసయ్యాడు. రోజూ ఫుల్లుగా తాగి వచ్చి భార్యను వేధించేవాడు. నిన్న కూడా ఇదే విషయమై ఇద్దరి మద్య గొడవ జరిగింది. భర్త ఎంత చెప్పినా తీరు మార్చుకోవడం లేదని భార్య.. నిన్న రాత్రి పిల్లలను తీసుకొని తన పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య ఇళ్లొదిలి వెళ్లపోవడం తట్టుకోలేని భర్త గోపాల్ అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.