Young man who took his life in a reels madness: సోషల్ మీడియాలో కొన్ని క్షణాల గుర్తింపు కోసం యువత ప్రాణాలను పణంగా పెడుతున్న వైనం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్‌లో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కేవలం ఒక రీల్ కోసం లైసెన్స్ ఉన్న పిస్టల్‌తో విన్యాసాలు చేస్తూ, 28 ఏళ్ల పవన్ కుమార్ అనే యువకుడు ప్రమాదవశాత్తు తనను తాను కాల్చుకుని ప్రాణాలు కోల్పోయాడు.
తూర్పు ఢిల్లీలోని దల్లూపురా గ్రామానికి చెందిన పవన్ కుమార్, తన బంధువు హిమాన్షుకు చెందిన లైసెన్స్డ్ పిస్టల్‌తో రీల్ షూట్ చేయాలనుకున్నాడు. హిమాన్షు వీడియో తీస్తుండగా, పవన్ ఆ పిస్టల్‌లో మ్యాగజైన్ లోడ్ చేస్తూ స్టైల్‌గా ఫోజులిచ్చాడు. ఆ క్రమంలో పిస్టల్‌ను తన గుండెకు ఎడమవైపున ఉంచుకుని ట్రిగ్గర్ నొక్కడంతో ఒక్కసారిగా బుల్లెట్ దూసుకెళ్లింది. తీవ్ర రక్తస్రావంతో పవన్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
ఈ హృదయ విదారక దృశ్యాలన్నీ ఫోన్ కెమెరాలో రికార్డయ్యాయి. వీడియోలో పవన్ పిస్టల్ లోడ్ చేస్తుండగా, అతని బంధువు హిమాన్షు జాగ్రత్త.. అది పేలుతుంది అని హెచ్చరించడం కూడా వినిపిస్తోంది. కానీ, అతి ఉత్సాహం ప్రదర్శించిన పవన్ ఆ హెచ్చరికను పెడచెవిన పెట్టాడు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్ లైక్‌లు, కామెంట్ల కోసం మారణాయుధాలతో విన్యాసాలు చేయడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి నిరూపించింది.
నేటి తరం యువత సోషల్ మీడియా మాయలో పడి వాస్తవ ప్రపంచాన్ని విస్మరిస్తోంది. ఒక వీడియోకు వచ్చే వ్యూస్ కంటే ప్రాణం అత్యంత విలువైనదని గుర్తించలేకపోతున్నారు. ఎత్తైన భవనాల అంచున నిలబడి సెల్ఫీలు తీసుకోవడం, వేగంగా వెళ్లే రైళ్ల ముందు స్టంట్లు చేయడం, ఇప్పుడు తుపాకులతో రీల్స్ చేయడం వంటివి ప్రాణాల మీదకు తెస్తున్నాయి. సోషల్ మీడియా వాలిడేషన్ కోసం క్షణికావేశంలో చేసే పనులు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిలిస్తున్నాయి.
మీ ప్రాణం ఒక రీల్ కంటే ఎంతో విలువైనది. సాహసాలు ప్రదర్శించే ముందు మీపై ఆధారపడిన కుటుంబాన్ని ఒక్కసారి తలుచుకోండి అని పెద్దలు సూచిస్తున్నారు.
