Parents Protest Infornt Of Their Daughter House: తమ కూతురు బంగారం తీసుకుని తమను మోసగించిందంటూ తల్లిదండ్రులు ఆమె ఇంటి ముందు ధర్నాకు దిగిన ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో (Medchal District) జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్కాజిగిరి వాణీనగర్‌లో శివమ్మ, మల్లయ్య దంపతులు నివాసం ఉంటున్నారు. కుమార్తె బాలామణి సైతం వారి ఇంటికి సమీపంలోనే ఉంటోంది. రెండేళ్ల క్రితం ఊరెళ్తూ తాము తమ బిడ్డ వద్ద 30 తులాల బంగారం దాచి పెట్టామని దంపతులు చెబుతున్నారు. తర్వాత తిరిగి ఇమ్మని అడిగితే తనకు ఇవ్వలేదని అబద్ధం చెబుతోందని.. ఇచ్చినట్లు ఆధారాలు చూపాలని అడుగుతోందని వాపోయారు.
ఈ విషయంపై గతంలో పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోయిందని వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మానవ హక్కుల పరిరక్షణ సమితి సభ్యుల సహకారంతో వృద్ధ దంపతులు కుమార్తె ఇంటి ముందు ధర్నాకు దిగారు. కన్నకూతురే ఇలా చేయడం భావ్యం కాదని.. తమను వృద్ధాప్యంలో రోడ్డెక్కేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ బంగారం తమకు ఇప్పించాలని మీడియా సమక్షంలో వేడుకుంటున్నారు. అయితే, వృద్ధ దంపతులు ఊరికి వెళ్లే ముందు తమ బిడ్డ వద్ద బంగారం ఉంచామని చెబుతున్నారని.. ఆమె ప్రభుత్వ ఉద్యోగస్తురాలు అని మానవ హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు తెలిపారు.