రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన జంట హత్యలు నరసరావుపేటలో కలకలం రేపాయి. యాచకులను లక్ష్యంగా చేసుకొని ఓ సైకో దారుణ హత్యలకు పాల్పడ్డాడు. సిసి టివి ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసును ఛేదించి నిందితుడిని  అదుపులోకి తీసుకున్నారు. 


పల్నాడు జిల్లా నరసరావుపేటలో రైల్వే స్టేషన్ రోడ్డులో పద్మ పూజిత కన్సల్టెన్సీ షాప్ వద్ద వరంగల్‌కు చెందిన సంపత్ రెడ్డి (45) బుధవారం తెల్లవారు జామున దారుణ హత్యకు గురయ్యాడు. సమాచారం అందుకున్న వన్ టౌన్ సీఐ అశోక్ కుమార్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహంపై గాయాలు ఉండటాన్ని గమనించారు. సమీపంలో సీసీ పుటేజ్ పరిశీలించగా మంగళవారం అర్ధరాత్రి నిద్రిస్తున్న సంపత్ రెడ్డిపై బండరాయితో మోది హత్యచేసినట్లు గుర్తించారు. 


అది జరిగిన ప్రదేశానికి కూతవేటు దూరంలో ఉన్న కాసు బ్రహ్మానందరెడ్డి కాంప్లెక్స్ వెనుక భాగంలో మరో హత్య జరిగినట్లు సమచారం అందింది. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. అక్కడ క్రైమ్‌ సీన్‌ను పరిశీలించగా నిద్రిస్తున్న వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తి హత్ చేసినట్టు గుర్తించారు. 


రెండు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న సంపత్ రెడ్డి కుటుంబ సభ్యులు వైద్యశాలకు చేరుకున్నారు. ఇంట్లో అలిగి నాలుగు రోజుల క్రితం నరసరావుపేటకు వచ్చినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేశారు. 


పట్టణంలో జంట హత్యల ఘటనలను సీరియస్‌గా తీసుకున్న పల్నాడు జిల్లా ఎస్పీ వై. రవిశంక రెడ్డి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. అనుమానితుల్లో ఒకడైన పాత నేరస్తుడు తన్నీరు అంకమ్మరావు అలియాస్ ముళ్లపందిని అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో పోలీసులు. విచారించటంతో కేసు చిక్కుముడి వీడింది. 


రెండు హత్యలు తానే చేసినట్లు నేరాన్ని అంకమ్మరావు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. ఇద్దరిని హత్య చేసి వారి వద్ద నుంచి నగదు దోచుకొని వెళ్లినట్లు పోలీసులు తెలుపుతున్నారు. ఈ విచారణలో భాగంగానే మరో హత్య వెలుగులోకి వచ్చింది. 


ఈ నెల 5వ తేదీన మార్కెట్ సెంటర్ సమీపంలోని సాంబశివ ఫర్నీచర్స్ వద్ద గుర్తు తెలియని మహిళ హత్యకు గురయ్యారు. నిద్రిస్తున్న సమయంలో బండరాయితో మోది ఆమెను హత్య చేశారు. ఆమెను కూడా హత్య చేసింది. తానేనని తన్నీరు అంకమ్మరావు ఒప్పుకోవడంతో పోలీసులు విస్తుపోయారు. 


నిందితుడిపై ఇప్పటికే సుమారు 20 కేసులు ఉన్నాయి. అందులో 4 మర్డర్ కేసులు కాగా మిగతావి దొంగతనాలు కేసులుగా పోలీసులు వెల్లడి.. పల్నాడు జిల్లాతోపాటు వివిధ పోలీసు స్టేషన్లలో చోరీ, దోపిడీ కేసులు ఉన్నాయి. గత ఏడాది 5వ నెలలో గీతామందిర్ రోడ్డులో ఒంటరిగా నిద్రిస్తున్న మహిళను హత్య చేసి ఆమె వద్ద నుంచి రూ.2.70 లక్షలు దోచుకుపోయాడు. 


ఆ కేసులో గత సంవత్సరం జులైలో జైలుకువెళ్లి ఈ ఏడాది మార్చిలో తిరిగి వచ్చాడు. సరైన ఆధారాలు లేవని అంకమరావుని కోర్టు విడుదల చేసింది. బయటకు వచ్చిన తర్వాత వరుస హత్యలకు పాల్పడ్డాడు. సైకో చేస్తున్న  హత్యలు జిల్లలో కలకలం రేపాయి.