Palnadu News : మాచర్ల రూరల్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ నాగమల్లేశ్వరి(24) ఆత్మహత్యాయత్నం చేశారు. గురువారం కంభంపాడు గ్రామ సమీపంలోని నాగార్జున సాగర్ కుడి కాలువ వద్ద యాసిడ్ తగినట్లు సమాచారం.  ప్రాణాపాయ స్థితిలో ఉన్న నాగమల్లేశ్వరిని స్థానికులు గమనించి మాచర్ల రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ ఎస్ఐ ఆదిలక్ష్మి సంఘటన స్థలానికి చేరుకొని ఆత్మహత్యకు పాల్పడిన నాగమల్లేశ్వరిని మాచర్ల ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. ప్రాథమిక చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం గుంటూరు  జీజీహెచ్ కు తరలించారు. లేడీ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి కారణాలు తెలియాల్సి ఉంది. 



మహిళా కానిస్టేబుల్ కు లైంగిక వేధింపులు


సామాన్యులకు సమస్య వస్తే పోలీసు స్టేషన్ కు పరిగెడతారు. మరి పోలీసుకే సమస్య వస్తే ఏం చేస్తారు. లెక్క ప్రకారం వారు కూడా పోలీసు స్టేషన్ కే వెళ్లాలి. అక్కడ సాధారణ వ్యక్తుల్లాగే ఫిర్యాదు చేయాలి. అసలు సమస్య ఏమిటో చెప్పాలి. కానీ పోలీసు స్టేషన్ లో న్యాయం జరగదని తెలిస్తే ఏంచేస్తారు. సాధారణ వ్యక్తుల్లాగే వాళ్లు కూడా రోడ్డు ఎక్కాల్సిందే. నడి రోడ్డుపై బైఠాయించి న్యాయం కావాలంటూ ఆందోళన చేయాల్సిందే. అదే జరిగింది పల్నాడు జిల్లా నరసరావు పేట మండలం యల్లమందలో. షేక్ హసీనా మహిళా పోలీసు కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన స్వర్ణ శరత్, స్వర్ణ మల్లిఖార్జున రావు అనే వ్యక్తులు మద్యం తాగి షేక్ హసీనా పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. మహిళా పోలీసు అని కూడా చూడకుండా మద్యం మత్తులో వేధించారు. 


పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు..


తనపై ఇద్దరు వ్యక్తులు వేధింపులకు దిగడంతో మహిళా పోలీసు షేక్ హసీనా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. యల్లమంద గ్రామానికి చెందిన స్వర్ణ శరత్, స్వర్ణ మల్లిఖార్జున రావులు తనను వేధించారని, అసభ్యకరంగా ప్రవర్తించారని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు షేక్ హసీనా. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిద్దరూ మరింతగా రెచ్చిపోయారు. మా పైనే కంప్లైంట్ ఇస్తావా అంటూ మరోసారి వేధింపులకు దిగారు. మద్యం సేవించి మత్తులో తూగుతూ వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించారు. మాటలతో మహిళా పోలీసు షేక్ హసీనాను వేధించారు. తర్వాత చేతలతోనూ ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. తాను ఓ మహిళా పోలీసు అని తెలిసినా వేధింపులకు దిగడంపై హసీనా ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదని వాపోయారు. 


సచివాలయం ఎదుట ధర్నా 


పోలీసునే వేధించడం, అసభ్యకరంగా ప్రవర్తించడం, కంప్లైంట్ చేస్తే వారి వేధింపులు మరింత పెరగడంతో మహిళా పోలీసు షేక్ హసీనా రోడ్డుపై బైఠాయించారు. కుటుంబ సభ్యులతో కలిసి నడి రోడ్డుపై కూర్చుని ధర్నా చేశారు. తనకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. తనను వేధించిన యల్లమంద గ్రామానికి చెందిన స్వర్ణ శరత్, స్వర్ణ మల్లిఖార్జున రావులను శిక్షించాలని కోరారు. తన చెల్లి షేక్ హసీనాపై వేధింపులకు పాల్పడ్డ ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేయాలని బాధిత మహిళ సోదరుడు డిమాండ్ చేశారు. స్వర్ణ శరత్, స్వర్ణ మల్లిఖార్జున రావులకు కొందరు సచివాలయ సిబ్బంది మద్దతు ఇస్తున్నారని షేక్ హసీనా సోదరుడు ఆరోపించారు.