Srikakulam Road Accident: దైవ దర్శనానికి వెళ్తుండగా శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలాస మండలం నెమలినారాయణపురం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ఆటోను వేగంగా దూసుకొచ్చిన కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న 8 మంది ప్రయాణికులతో పాటు ఆటో డ్రైవర్ సైతం తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న 1033 హైవే అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను పలాస ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఒడిశాలోని దేవాలయం దర్శించుకునేందుకు..
జిల్లాలోని రెంటికోట గ్రామానికి చెందిన రాము స్వామి తన కుటుంబ సభ్యులతో కలిసి ఒడిశా రాష్ట్రం బరంపురం సమీపంలో ఉన్న మంత్రేడ్డి దేవాలయం దర్శించుకోవాలని భావించారు. నేటి (శనివారం) ఉదయం ఆటోలో ఇంటి నుంచి బయలుదేరిన కేవలం 10 నిమిషాలకే ప్రమాదం చోటు చేసుకుంది. దైవ దర్శనానికి కుటుంబంతో పాటు బయలుదేరగా, ఆ ఆటోను ఓ కారు ఢీకొట్టడంతో కుటుంబ సభ్యులందరూ ఆసుపత్రి పాలయ్యారు.
ఛేజ్ చేసి కారు డ్రైవర్ ను పట్టుకున్న పోలీసులు
ఆటోను కారు ఢీకొన్న ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 8 మంది కుటుంబసభ్యులతో పాటు ఆటో డ్రైవర్ సైతం తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ప్రాథమికి చికిత్స నిమిత్తం స్థానికులు పలాస ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్ర గాయాలపాలైన ఆటో డ్రైవర్ ను మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ మాత్రం వాహనాన్ని ఆపకుండా పారిపోయే ప్రయత్నం చేశాడు. స్థానికుల నుంచి రోడ్డు ప్రమాదం సమాచారం, కారు వివరాలు కనుక్కున్న పోలీసుల నిఘా పెట్టి కారును పట్టుకున్నారు. కారు వెళ్తున్న రూట్ లో పోలీసులను అలర్ట్ చేయగా, ఛేజ్ చేసిన పోలీసులు చాకచక్యంగా కంచిలి సమీపంలో కారు డ్రైవర్ ను పట్టుకున్నారు. కారును స్టేషన్ తరలించిన పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.