50 Cars Puntured In Mumbai And Nagpur Highway: రహదారిపై ఇనుప మేకులు, గాజు వస్తువులు, గతుకులు, రోడ్డు సరిగ్గా లేకపోవడం వంటి కారణాలతో వాహనాలు పంక్చర్ కావడం మనం చూసుంటాం. అయినా కూడా ఒకటి లేదా రెండు వాహనాలు ఇలా కావొచ్చు. కానీ, ఏకంగా 50 వాహనాలు ఒకేసారి ఇలా పంక్చర్‌కు గురై గంటల పాటు ట్రాఫిక్ జాం జరిగిన ఘటన ముంబైలో (Mumbai) చోటు చేసుకుంది. ముంబై - నాగపూర్ సమృద్ధి హైవేపై జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల రాత్రి 10 గంటల ప్రాంతంలో వాషిం జిల్లాలోని మాలెగావ్ మీదుగా వెళ్తున్న కార్లు, ట్రక్కులు వరుసగా 50 వాహనాలు ఒకేసారి పంక్చరయ్యాయి. ఈ క్రమంలో రహదారిపై కొన్ని గంటల పాటు ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఏం జరుగుతుందో అర్థం కాక వాహనదారులు గందరగోళానికి గురయ్యారు. ఎలాంటి సాయం అందక రాత్రంతా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అయితే, రోడ్డుపై ఇనుప బోర్డు పడడంతోనే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదవశాత్తు ఇది జరిగిందా.? లేక ఎవరైనా కావాలనే ఇలా చేశారా.? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, ఈ ఏడాది జూన్ లో జల్నా జిల్లాలోని ఇదే హైవేపై రెండు కార్లు ఢీకొన్న ఘటనలో.. ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ముంబయి - నాగపూర్‌ను కలుపుతూ నిర్మించిన రోడ్డు ఇది. దేశంలోనే అతి పొడవైన గ్రీన్ ఫీల్డ్ రోడ్ ప్రాజెక్టులో భాగంగా దాదాపు రూ.55 వేల కోట్ల వ్యయంతో ఈ రహదారిని నిర్మించారు.
Also Read: New Year 2025: న్యూ ఇయర్ కి సిద్దమైన దేశ రాజధాని, 10 వేల సిబ్బందితో ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం