Chandrababu Distributes Pensions in Narasaraopet | నరసరావుపేట: కూటమి ప్రభుత్వం ఒకరోజు ముందుగానే లబ్దిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇస్తోంది. ఇందులో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం నాడు పల్నాడు జిల్లా నరసరావుపేటలో పర్యటిస్తున్నారు. ఉదయం 11.30కి ఉండవల్లిలోని నివాసం నుంచి బయలుదేరిన చంద్రబాబు 12 గంటలకు యల్లమందకు చేరుకున్నారు. మండలంలోని యల్లమంద గ్రామంలో లబ్దిదారు శారమ్మ ఇంటికి వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రూ.4 వేల పింఛన్ లబ్ధిదారుకు స్వయంగా సీఎం చంద్రబాబు అందజేశారు. బాగా చదువుకోవాలని శారమ్మ పిల్లలకు చంద్రబాబు సూచించారు. చురుకుగా ఉన్నావని, బాగా చదివితే మంచి స్థాయికి వస్తాయని ఆశీర్వదించారు.
ఏపీలో జనవరి నెల పింఛన్ల పంపిణీ మొదలైంది. ఏపీ సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. పింఛన్‌దారుల ఇంటికి వెళ్లి సీఎం చంద్రబాబు పింఛన్ పంపిణీ చేశారు. వారి కుటుంబంతో మాట్లాడి, సమస్యలు అడిగి తెలుసుకుని కూటమి ప్రభుత్వంలో అందరికీ న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
రూ.5 లక్షలు అందించాలని సీఎం ఆదేశాలు
అనంతరం మరో పింఛన్ లబ్ధిదారుడు ఏడుకొండలు ఇంట్లో సీఎం చంద్రబాబు టీ పెట్టారు. తనకు టీ షాప్ పెట్టుకునేందుకు రూ.5 లక్షల లోన్ ఇవ్వాలని ఏడుకొండలు కోరారు. స్పందించిన సీఎం చంద్రబాబు బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.5 లక్షలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇంటి నిర్మాణం పూర్తి చేసుకునేందుకు లోన్ ఇవ్వాలని అధికారును చంద్రబాబు ఆదేశించారు. గ్రామంలోని కోదండరామస్వామి దేవాలయాన్ని చంద్రబాబు దర్శించుకున్నారు. అనంతరం హెలిప్యాడ్ ప్రాంతంలో సీఎం లంచ్ చేసి అనంతరం, జిల్లా అధికారులతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.
కోటప్పకొండను దర్శించుకోనున్న సీఎం చంద్రబాబు
జిల్లా అధికారులు, పార్టీ నేతలతో సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు కోటప్పకొండకు చేరుకుంటారు. అక్కడ త్రికోటేశ్వరస్వామిని దర్శించుకుని, ఆలయంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దర్శనం అనంతరం కోటప్పకొండ నుంచి యల్లమందలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. దాదాపు 3 నుంచి 4 గంటల మధ్య యల్లమంద నుంచి ఉండవల్లికి బయలుదేరతారని అధికారులు తెలిపారు.
దేశంలోనే అత్యధిక పింఛన్ ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇంత ఎక్కువ పింఛన్లు ఇస్తున్న రాష్ట్రాన్ని దేశంలో చూపించగలరా? కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే వారికి ఇదే నా సవాల్. పేదవారి బాధలు చూసి ఎన్టీఆర్ పింఛన్లు తీసుకొచ్చారు. తెలంగాణలో పింఛన్లకు రూ.8,179 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తున్నారు. ఏపీకి దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. సూపర్ సిక్స్ ఏమైందని అడుగుతున్నారు. ఏపీలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది. - ఏపీ సీఎం చంద్రబాబు
12 గంటల వరకే 91 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి
నెలకు ముందు రోజే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని, మొదలుపెట్టిన రోజే మధ్యాహ్నం 12 గంటల వరకే పింఛన్ల పంపిణీ 91 శాతం పూర్తయ్యింది. జనవరి నెలకు సంబంధించి 63,77,943 మంది లబ్దిదారులకు పింఛన్ల పంపిణీ చేస్తున్నారు. సచివాలయ ఉద్యోగులు వేగంగా పింఛన్ల పంపిణీ చేస్తున్నారు. సాయంత్రానికల్లా పింఛన్ల పంపిణీ దాదాపు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.