తొందరపాటు నిర్ణయం నవ దంపతులను బలి తీసుకుంది. పెళ్లి నెల రోజులు దాటక ముందే తిరిగిరానిలోకాలకు పంపించింది. ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టిన వారు 30 రోజులకే ఒకరి తర్వాత మరొకరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీంతో ఇరువురి కుటుంబాల్లోనూ తీవ్ర విషాదం నెలకొంది. బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా మేదరమెట్ల గ్రామంలో చోటు చేసుకుంది.
గ్రామస్థులు, పోలీసులు వెల్లడించిన వివరాలు ఇవీ.. కొరిశపాడు మండలం మేదరమెట్లకు చెందిన పొదిలి శ్రీమన్నారాయణ, రమణమ్మ దంపతుల కుమారుడు మహానంది అనే 30 ఏళ్ల వ్యక్తి ఛత్తీస్‌గఢ్‌లో సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి ఒంగోలు మండలం ముక్తి నూతలపాడుకు చెందిన ప్రియాంక అనే 24 ఏళ్ల యువతితో పెళ్లి చేశారు. వైభవంగా గత ఏడాది డిసెంబర్ 28న పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. సంక్రాంతి జరుపుకొని పండుగ తర్వాత భార్యను మెట్టింట్లోనే ఉంచి మహానంది ఛత్తీస్ గఢ్‌లో విధుల్లో చేరాడు.
అయితే, ఇటీవల ఏపీలో కానిస్టేబుళ్ల భర్తీ ప్రకటన విడుదలైంది. దీంతో ఆ పరీక్షలకు చదవాలని మహానంది తన భార్య ప్రియాంకను కోరాడు. అయితే, ఉద్యోగం చేయడం తనకు ఇష్టం లేదని ప్రియాంక చెప్పేసింది. ఇతను ఉద్యోగం చేయాల్సిందేనని పట్టుబట్టాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య మనస్ఫర్థలు వచ్చినట్లుగా తల్లిదండ్రులు తెలిపారు. ఇది భరించలేని ప్రియాంక ఈ నెల 4న పుట్టింట్లోని తన పడక గదిలో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న మహానంది.. హుటాహుటిన విమానంలో హైదరాబాద్ చేరుకొని.. అక్కడి నుంచి బస్సులో ఒంగోలుకు చేరుకున్నాడు.
ఒంగోలు వచ్చి తన తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడి భార్య లేని జీవితం తనకు వద్దంటూ వాపోయాడు. అఘాయిత్యం చేసుకుంటాడని ఆందోళన చెందిన తల్లిదండ్రులు అతనికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేదు. అనంతరం ఉదయం 5 గంటల సమయంలో వాసు అనే స్నేహితుడి ఫోన్ చేసి తాను గుండ్లకమ్మ రిజర్వాయర్ దగ్గర ఉన్నానని, చనిపోతున్నట్టు మహానంది చెప్పాడు.
వెంటనే, స్నేహితులు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హుటాహుటిన అక్కడికి చేరుకోగా.. ఒడ్డున మహానంది బ్యాగ్, షూ, ఫోన్, ఫొటోలు ఉండటాన్ని గుర్తించి లబోదిబోమన్నారు.పోలీసులు, ఒంగోలు, అద్దంకి అగ్నిమాపక సిబ్బంది జలాశయం వద్దకు చేరుకుని బోట్ల సహాయంతో జలాశయంలో గాలింపు చర్యలు చేపట్టి.. మహానంది మృతదేహానని బయటకి తీశారు. చిన్నపాటి మనస్పర్థలకే భార్యాభర్తలు ఇలా ఆత్మహత్య చేసుకోవడం గ్రామస్థులను కలచి వేసింది. బంధు మిత్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.