Ongole YSRCP Leader Murder Case: ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. ఓ యువకుడిని లారీతో ఢీకొట్టి కిరాతకంగా హత్యచేశారు. జిల్లాలోని సింగరాయకొండ మండలం కనుమళ్ల గ్రామం వద్ద జాతీయ రహదారిపై గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పాత కక్షల కారణంగా నడిరోడ్డుపై వైసీపీ నేత పసుపులేటి రవితేజను హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.


లారీతో ఢీకొట్టి దారుణహత్య 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పసుపులేటి రవితేజ (32) ప్రకాశం జిల్లాలోని మూలగుంటపాడు గ్రామానికి చెందిన అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత. అక్కడే ఇసుక వ్యాపారం చేస్తుంటాడు. రవితేజ తండ్రి శ్రీనివాసరావు సోమరాజుపల్లి మాజీ సర్పంచి. రవితేజ, తన స్నేహితుడు ఉమ వేర్వేరు బైకులపై కనుమళ్లకు బయలుదేరారు. ఈ క్రమంలో గురువారం రాత్రి 8.30 గంటల సమయంలో వెనుక నుంచి దూసుకొచ్చిన లారీ రవితేజ బైక్ ను ఢీకొట్టడంతో రోడ్డు మీద పడిపోయాడు. అంతటితో ఆగకుండా లారీ డ్రైవర్ బైకుతో పాటు రవితేజను తొక్కిస్తూ వెళ్లిపోయాడు. లారీ తన మీద నుంచి వెళ్లడంతో వైసీపీ నేత రవితేజ అక్కడికక్కడే మృతిచెందాడు. 


మరో బైక్ మీద రవితేజ వెంటే వెళ్తున్న అతడి ఫ్రెండ్ ఉమ ఇది గమనించి.. లారీని ఆపడానికి ప్రయత్నించాడు. తన బైక్ మీద ఛేజ్ చేసి, లారీని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. కానీ అతడిని సైతం ఢీకొట్టేందుకు లారీ డ్రైవర్ ప్రయత్నించగా తప్పించుకున్నాడని పోలీసులు వెల్లడించారు. చనిపోయిన యువనేత రవితేజకు భార్య, ఐదేళ్ల కుమార్తె ఉన్నారని సమాచారం. 


ఉపాధ్యక్ష పదవి వివాదమే కారణమా ?
సింగరాయకొండ మండల పరిషత్‌ రెండో ఉపాధ్యక్ష పదవి విషయంలో నెలకొన్న వివాదమే రవితేజ హత్యకు దారి తీసిందని స్థానికులు చెబుతున్నారు. ఉపాధ్యక్ష పదవి విషయంలో ఓ ఎంపీటీసీ సభ్యుడికి, రవితేజకు వివాదం నెలకొన్న సమయంలో ఈ హత్య జరిగింది. ఈ ఘటన తరువాత మాలగుంటపాడు గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పార్టీలోని మరో వర్గం ఈ హత్య చేసి ఉంటుందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అప్రమత్తమైన పోలీస్ ఉన్నతాధికారులు ఒంగోలు నుంచి అదనపు బలగాలు రప్పించి గ్రామంలో పికెట్‌ ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.


వైఎస్సార్‌సీపీ నేత గంజి ప్రసాద్‌ దారుణహత్య 
ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత హత్య ఏలూరు జిల్లాలో కలకలం రేపింది. అధికార పార్టీ నేత, గ్రామ అధ్యక్షుడు గంజి ప్రసాద్‌ను కొందరు దుండగులు కత్తులతో నరికి దారుణంగా హత్య చేశారు. దాంతో ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై జి కొత్తపల్లికి చెందిన కొందరు దాడి చేశారు. ఏమి చేయలేని పరిస్థితిలో పోలీసులు చూస్తుండిపోయారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాడుల నుంచి బాధితుల్ని రక్షించాడానికి వచ్చిన పోలీసులపై దాడి చేయడం మరింత వివాదానికి కారణమైంది.


జి.కొత్తపల్లిలో ఇరువర్గాల మధ్య ఆధిపత్యంతో గంజి ప్రసాద్‌ హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మరో వర్గానికి మద్దతు వల్లే హత్య జరిగిందంటూ గంజి ప్రసాద్‌ను పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై దాడికి యత్నించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎమ్మెల్యేపై దాడిని అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపై సైతం మరో వర్గానికి చెందిన వైసీపీ నేతలు, కొందరు గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. ప్రసాద్ హత్యకు కారకుడువు నీవే, నీకు ఇందులో హస్తం ఉందని ఆరోపిస్తూ వైసీపీకి చెందిన మరో వర్గం నేతలు ఆరోపిస్తూ ఎమ్మెల్యేపై దాడికి పాల్పడ్డారు. దాడి భయంతో ఎమ్మెల్యే స్కూల్లోకి వెళ్లి పోలీసుల సాయంతో అక్కడే తలదాచుకున్నారు.