Hyderabad Murder: కోపం, ఆవేశం మనసును దహించి వేస్తుంది. పగ మనిషిని పశువును చేస్తుంది. పగ ఉన్న మనిషి పాముతో సమానం అన్న సామెత అందుకే పుట్టింది. పగతో రగిలి పోయే వ్యక్తులు అదను కోసం చూస్తారు. అన్ని అనుకూలించినప్పుడు ఒక్కసారిగా తమ పగ తీర్చుకుంటారు. ప్రాణాలు తీసేందుకు కూడా వెనకాడరు. ఆ ప్రతీకారేచ్ఛ వారిని దహించి వేస్తుంది. పగ చల్లారే వరకు వారిని కుదురుగా ఉండనివ్వదు.
పాతకక్షలతో కత్తులతో దాడి..
రంగారెడ్డి జిల్లాలో జరిగిన కత్తుల వీరంగం అలాంటిదే. అది రంగారెడ్డి జిల్లా మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శాస్త్రీపురం ఒవైసీ హిల్స్ లో ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ జరిగింది. ఆ యువకుల పేర్లు మహ్మద్ సబ్దార్, ఇజ్రాయిల్. వారి మధ్య ఉన్న పాత కక్షలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. తీవ్రంగా కొట్టుకున్నారు. ఆ సమయం కోసమే చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్న మహ్మద్.. తన వెంట తెచ్చుకున్న కత్తితో ఇజ్రాయిల్ అనే యువకుడిపై దాడి చేశాడు. సబ్దార్ అనే యువకుడు ఇజ్రాయిల్ పై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపరిచాడు. దాంతో ఆవేశం పట్టలేని ఇజ్రాయిల్ సోదరుడు నబీ.. కత్తితో సబ్దార్ పై తిరిగి దాడి చేశాడు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. రక్తమోడుతున్న వారిని స్థానికులు దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. దవాఖానాలో చికిత్స పొందుతూ సబ్దార్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు ఈ కత్తుల వీరంగపై పోలీసులు కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
మద్యం మత్తులో డ్రైవింగ్
మద్యం మత్తులో కార్ నడుపుతూ ఓ ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన మేడ్చల్ జిల్లా బాచుపల్లి పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది.
బాచుపల్లి పీఎస్ పరిధి సాయినగర్ ఆర్ఆర్ఆర్ వైన్స్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మియాపూర్ నుండి గండి మైసమ్మ వైపు వెళ్తున్న మారుతి కార్ లో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు మద్యం మత్తులో అతి వేగంగా కారు నడుపుతూ ప్రమాదానికి కారణం అయ్యారు. మద్యం మత్తు, అతి వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగే ప్రమాదానికి కారణాలుగా పోలీసులు గుర్తించారు. కారు వేగంగా వచ్చి బైక్ నడుపుతున్న వ్యక్తిని వెనక నుండి ఢీ కొట్టారు. ఈ సంఘటనలో బైక్ నడుపుతున్న వ్యక్తికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. అక్కడే ఉన్న వాళ్లు హుటా హుటినా ద్విచక్ర వాహనదారుడిని బాచుపల్లిలోని మమత ఆసుపత్రికి తరలించారు.
కారుతో బైక్ నడుపుతున్న వ్యక్తిని ఢీకొట్టిన తర్వాత మద్యం మత్తులో ఉన్న యువకులు కారును ఆపకుండా అక్కడి నుండి పారిపోయారు. తర్వాత కారును ప్రగతి నగర్ కమాన్ వద్ద వదిలి పారిపోయారు. నిందితులు వదిలిన కారులో లిక్కర్ బాటిళ్లు, సోడా, కూల్ డ్రింకులు, గ్లాసులను గుర్తించారు పోలీసులు. మద్యం సేవించి, ఆ మత్తులోనే కారును అతి వేగంగా నడిపినట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు ఈ సంఘటనపై హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసుకున్నారు. నిందితుల గురించి గాలింపు చేపట్టారు.